కడియం: వేమగిరిలోని జీఎంఆర్ సంస్థ ఆ గ్రామ పంచాయతీకి రూ.1,47,72,147 పన్ను బకాయి పడింది. పన్ను వసూలుపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఎంపీడీవో కె.రమేష్, డిప్యూటీ ఎంపీడీవో ఎన్.శ్రీనివాస్, కార్యదర్శులు రూప్‌చంద్, ఎ.శ్రీనివాసరావు బుధవారం జీఎంఆర్ సంస్థ ప్రతినిధులను కలిశారు. తక్షణమే పన్ను బకాయిలు చెల్లించాలని కోరారు.
లభ్యం కాని రాహుల్ ఆచూకీ
అనపర్తి: హోలీ సందర్భంగా అనపర్తిలో కాలువలో స్నానానికి వెళ్లి గల్లంతైన తొమ్మిదేళ్ల కొమరపు రాహుల్ ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం 10 గంటలకు కాలువలో పడిపోయిన రాహుల్ కోసం పోలీస్, అగ్నిమాపక సిబ్బంది రాత్రి వరకూ గాలించారు. చీకటి పడడంతో గాలింపును నిలిపివేసి, బుధవారం తెల్లవారు జాము నుంచి ప్రారంభించారు. అనపర్తి ఎస్సై ఎల్.శ్రీను నాయక్, ఫైర్ ఆఫీసర్ జీరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ధవళేశ్వరం నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు కాలువలోని చెత్తను తొలగించి అణువణువూ జల్లెడపడుతున్నారు. అలాగే అనపర్తి పోలీసులు డ్రోన్‌తో కాలువ పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. అయినా బుధవారం సాయంత్రం వరకు బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం నీటి లెవెల్ తగ్గించి మళ్లీ వెతుకుతామని ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు.
దివ్యాంగ క్రీడాకారులకు
అభినందనలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): దివ్యాంగ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమీర్ దివ్య సాహిత్య ట్రస్ట్ నిర్వహణలో ఒడిశాలో ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు జరిగిన వీల్‌చైర్ క్రికెట్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఈ జట్టులో ఎనిమిది మంది క్రీడాకారులు తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు కావడం విశేషం. ఈ సందర్భంగా కలెక్టర్ కలెక్టర్ కీర్తి ఆ క్రీడాకారులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ పోటీల్లో పాల్గొని ఉత్తమ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) శేషగిరి, యోగా కోచ్ నాగేంద్ర, ఫుట్‌బాల్ కోచ్ నాగరాజు, చెస్ కోచ్ జగన్నాథరావు పాల్గొన్నారు.
ఫ సహజ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహార ధాన్యాలను వినియోగించడం వల్ల కుటుంబ ఆరోగ్యం కాపాడుకోవచ్చని కలెక్టర్ కీర్తి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో అవగాహన – శిక్షణ నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న రైతు సాధికార సంస్థ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఆ ఉత్పత్తులను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, పాఠశాల విద్యార్థులకు, గర్భిణులకు, బాలింతలకు అందిస్తే ఆరోగ్య స్థితి మెరుగుపడుతుందన్నారు.


