కపిలేశ్వరపురం/సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అరచేతిలో వైకుంఠాన్ని చూపించి ఓట్లు దండుకునే వైఖరి సీఎం చంద్రబాబుది. 2000 సంవత్సరంలో శ్రామిక మహిళలను గుర్రాలతో తొక్కించిన ఆయన ప్రభుత్వం మరోసారి మహిళలపై విరుచుకుపడింది. ఎన్నికల హామీ అమలు చేయాలన్న డిమాండ్‌తో ‘చలో విజయవాడ’ చేపట్టిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంగన్‌వాడీలను అణచివేసి పలు పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పి వారిని కష్టాలు పెట్టారు.
ఉద్యమానికి ఊపిరి
ప్రధానంగా వేతనాలు పెంచాలని, ఐసీడీఎస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న డిమాండ్లతో ఆందోళనకు పిలుపునిచ్చిన అంగన్‌వాడీలను విజయవాడకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ ఏ మాత్రం వెరవకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి సుమారు ఐదు వేల మంది విజయవాడ ధర్నా చౌక్‌కు తరలివెళ్లారు. అక్కడి శిబిరంలో పోలీసులు చేపట్టిన దమనకాండలో కాకినాడకు చెందిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి, మండపేటకు చెందిన కె.కృష్ణవేణితో పాటు అనేక మంది తీవ్ర అణచివేతకు గురయ్యారు. వారిని ప్రతిఘటిస్తున్న అంగన్‌వాడీలను పోలీసులు పిన్నులతో గుచ్చారు. ఈడ్చుకెళ్తుండగా జి.బేబీరాణి చేయికి తీవ్ర గాయమైంది. ఆమెను ఆసుపత్రికి కాకుండా ఆమెతో పాటు మండపేటకు చెందిన కె.కృష్ణవేణి తదితరులను అమానవీయంగా బస్సుల్లోకి ఎక్కించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వేమగిరికి చెందిన అంగన్‌వాడీ బేబీరాణి, మరి కొందరిని పోలవరం, బుట్టాయిగూడెం ప్రాంతాలకు తరలించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మొబైల్‌ను లాక్కున్నారు. ఆమె అప్పటికే తన మొబైల్‌లో పోలీసుల దురుసు ప్రవర్తనను చిత్రీకరించి సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేయడంతో సమాజానికి చంద్రబాబు ప్రభుత్వ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఉమ్మడి జిల్లా అంతా నిరసనలతో దద్దరిల్లింది. కాకినాడలోని సుందరయ్య భవన్ నుంచి కలెక్టరేట్ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరం, అమలాపురం, రామచంద్రపురం, తదితర ప్రాంతాల్లోనూ, రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం వద్ద మానవహారం, ర్యాలీ, ధర్నాలు నిర్వహించారు.
యాప్‌లతో పని భారం
కేంద్ర ప్రభుత్వ యాప్ పోషణ ట్రాకర్‌లో వివిధ శాఖల వివరాలు నమోదు చేయడం కష్టతరంగా మారుతోంది. నెట్‌వర్క్ సరిగా లేకపోవడం, సర్వర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల ఫేస్ రిజిస్ట్రేషన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రోజంతా ఈ యాప్‌ల నమోదుతోనే సరిపోతుంది. ఇది కాకుండా అంగన్‌వాడీ సెంటర్‌లో పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు చేయవలసి రావడంతో అంగన్‌వాడీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
వేతనాలు పెంచాలి
రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో 400 మంది, రూరల్ పరిధిలో 250 మంది అంగన్‌వాడీలు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది అంగన్‌వాడీలు పనిచేస్తున్నారు. తక్షణ ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది..
2000 మార్చి 30న హైదరాబాద్‌లో ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం గుర్రాలతో తొక్కించింది. బాష్పవాయువు ప్రయోగించారు.
ఆ ఉద్యమంలో మండపేట నియోజకవర్గానికి చెందిన అంగన్‌వాడీ గాయాలపాలైంది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించే సమయంలోనూ అంగన్‌వాడీలపై లాఠీ చార్జి చేయించారు.
అంగన్‌వాడీలను బస్సులో తిప్పుతున్న పోలీసులు
దగాకోరు హామీలు ఇక చెల్లవు
నాడు గుర్రాలతో తొక్కించి..
నేడు పోలీసులతో ఈడ్పించారు
మహిళా దినోత్సవానికి ముందు
మంచి బహుమతే ఇచ్చారు
అంగన్‌వాడీల అణచివేతపై
ఉమ్మడి జిల్లా నాయకుల ఆగ్రహం
గెలిస్తే జీతాలు పెంచుతానన్న జగన్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే అంగన్‌వాడీల వేతనాలను రూ.11,500కు పెంచారు. తన పాలనాకాలంలో సమ్మె చేసిన అంగన్‌వాడీల పట్ల ఆయన సానుకూలంగా స్పందించి ఇచ్చిన హామీ మేరకు వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచారు. ఉద్యోగ విరమణ ప్రోత్సాహకాలను రూ.లక్షకు పెంచుతూ జీవో జారీ చేశారు. 2024లో అధికారంలోకి వస్తే 2024 జూన్ నుంచి వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే అందలం ఎక్కిస్తామని ప్రలోభ పెట్టిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాకా అంగన్‌వాడీలపై దమణకాండకు పాల్పడ్డారు.
పాశవికంగా దాడి చేయించారు
జీతాల పెంపుపై ప్రభుత్వానికి అనేకసార్లు వినతి పత్రాలిచ్చారు. ఫిబ్రవరిలో క్షేత్ర స్థాయిలో రిలే నిరాహార దీక్షలు చేశారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరం లేక చలో విజయవాడ చేపట్టాం. ప్రభుత్వం పాశవికంగా ప్రవర్తించింది.
– కె.కృష్ణవేణి, సీఐటీయూ
జిల్లా నాయకురాలు, మండపేట
అనేక ప్రాంతాల్లో తిప్పి వదిలారు
నిద్రలో ఉన్న మమ్మల్ని బలవంతంగా లాక్కెళ్లి బస్సులో 27 మందిని కుక్కేశారు. తరువాత సత్తెనపల్లి, యాళ్లగడ్డ, చిలకలూరిపేట, నరసరావుపేట పిడుగురాళ్ల, చింతలపూడి తదితర ప్రాంతాల్లో తిప్పారు. ఆకలి వేస్తుందన్న, కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా కూడా బస్సు ఆపలేదు. తిప్పి తిప్పి మరలా సత్తెనపల్లిలో కొంత మందిని, యాళ్లగడ్డలో కొంత మందిని వేర్వేరు ప్రాంతాల్లో దింపేశారు. అక్కడ నుంచి అనేక బస్సులు మారి జిల్లాకి చేరుకున్నాం.
– మాణిక్యాంబ, అంగన్‌వాడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు
ఇచ్చిన హామీని నెరవేర్చాలి
పనిభారం దృష్టిలో పెట్టుకుని వేతనం రూ.26 వేలు చేయాలి. ఎన్నికల ముందు చంద్రబాబు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. అంగన్‌వాడీ సెంటర్లను పాఠశాలల్లో విలీనాన్ని నిలుపుదల చేయాలి. అంగన్‌వాడీ బడ్జెట్ పెంచాలి. మా న్యాయమైన డిమాండ్లను తీర్చాలన్నందుకు మహిళలని చూడకుండా చిత్రహింసలు పెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాం. వాటిని నేరవేర్చలేనప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకు.
– బేబీ రాణి, కార్యదర్శి
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం
చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా అంగన్‌వాడీలపై దాడికి దిగుతున్నారు. 2000లో హైదరాబాద్‌లో గుర్రాలతో తొక్కించారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిలో అక్రమంగా అరెస్టు చేయించారు. ప్రస్తుత ఉద్యమంలో చర్చలు జరుపుతున్నట్టు నటిస్తూ అర్ధరాత్రి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతాం.
– జి.బేబీరాణి, అధ్యక్షురాలు, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్
అండ్ హెల్పర్స్ యూనియన్, కాకినాడ


