రాజమహేంద్రవరం రూరల్: హుకుంపేట గణేష్‌నగర్ జీవీకే సిగ్నేచర్స్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నెంబర్ 202లో టీడీపీ నేత, ఏపీ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ సంక్షేమ సభ్యుడు తమ్మా రవి భార్య తమ్మా విజయలక్ష్మి(40) సోమవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే అల్లుడి వేధింపులతోనే తన కుమార్తె చనిపోయిందని విజయలక్ష్మి తల్లి, కొత్తపేటకు చెందిన కాసా సూర్యకుమారి మంగళవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల ప్రకారం.. 2002లో తమ్మా రవితో విజయలక్ష్మికి వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే విజయలక్ష్మితో తల్లి మాట్లాడటానికి రవి అనుమతించేవాడు కాదు. పైగా కట్నం తీసుకు రావాలని వేధించడంతో పాటు వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. రవి తండ్రి సత్యనారాయణ కూడా మానసికంగా వేధించేవాడు. ఈ కారణాల వల్లే విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని సూర్యకుమారి ఫిర్యాదు చేశారు. బొమ్మూరు ఎస్సై కె.రమేష్ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఫ ఫ్లాట్‌లో ఉరి వేసుకుని మృతి
ఫ అల్లుడి వేధింపులే కారణమని మృతురాలి తల్లి ఫిర్యాదు


