ఆడబిడ్డకు దగా | - | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డకు దగా

Jun 6 2025 12:24 AM | Updated on Jun 6 2025 12:24 AM

ఆడబిడ

ఆడబిడ్డకు దగా

కొవ్వూరు మండలం కాపవరంలో సుందరంగా తయారైన జగనన్న కాలనీ

కూటమి పాలనలో మాయమైన

మహిళా సంక్షేమం

ఆడబిడ్డ నిధి కోసం నిరీక్షణ

కొందరికే ఉచిత గ్యాస్‌

అందని ఫ్రీ బస్సు

సాక్షి, రాజమహేంద్రవరం: మహిళలను మహారాణుల్ని చేస్తామన్నారు.. ఉచిత బస్సుతో ఎక్కడికై నా తిరగవచ్చన్నారు.. డ్వాక్రా సంఘాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామన్నారు.. ఇంకా 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1,500, తల్లికి వందనం, డ్వాక్రా రుణ పరిమితి రెట్టింపు ఇలా.. అనేక అడ్డగోలు హామీలిచ్చి అతివల ఓట్లు వేయించుకున్నారు. గద్దెనెక్కాక ఆ హామీలు అమలు చేయకుండా ఆడబిడ్డలను అడుగడుగునా దగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఒక్క పథకం కూడా అమలు చేయలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కూటమి పాలనలో అన్యాయం

● ఆడబిడ్డ నిధి పేరుతో 19 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తామని గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పెద్దలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఈ హామీకి అతీగతి లేదు. ఎప్పుడిస్తారన్న స్పష్టత కూడా లేదు. జిల్లావ్యాప్తంగా 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు సుమారు 6 లక్షల మంది ఉన్నారు. వీరందరూ ఆడబిడ్డ నిధి కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఏడాది కాలంలో సుమారు రూ.90 కోట్లు నష్టపోయారు.

● అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని కూటమి పెద్దలు చంద్రబాబు అండ్‌ కో హామీ ఇచ్చారు. ఏడాదవుతున్నా దీనికి అతీగతి లేదు. ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని చెబుతున్నా.. దీనిపై ఇప్పటి వరకూ ఎటువంటి విధివిధానాలూ రాలేదు. అధ్యయనాల పేరుతో ఏడాది గడిపేశారు. ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించేందుకు సుమారు 6.60 లక్షల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు.

● కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తల్లికి వందనం పేరిట చదువుకునే పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. ప్రతిపక్షం పోరాటాల ఫలితంగా దీనిని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెబుతున్నారు. అయితే ఎవరికిస్తారు.. అర్హులెవరు.. అందరికీ ఇస్తారా.. ఒక విద్యార్థికే పరిమితం చేస్తారా.. అనే మార్గదర్శకాలపై స్పష్టత ఇవ్వడం లేదు. కొద్ది రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నప్పటికీ దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 1.70 లక్షల తల్లులు తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారు.

ఉచిత గ్యాసే..!

ఉచిత వంట గ్యాస్‌ పథకంపై కూటమి ప్రభుత్వం నిబంధనల ‘బండ’ వేసింది. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక కొర్రీలు వేస్తున్నారు. అందరికీ కాకుండా కొందరికే దీనిని పరిమితం చేసేందుకు సవాలక్ష నిబంధనలు తెర పైకి తెచ్చారు. తొలుత దీపం పథకం ద్వారా గ్యాస్‌ పొందిన వారికే వర్తిస్తుందన్నారు. అనంతరం రేషన్‌ కార్డు కలిగిన వారికి మినహాయింపు ఇచ్చారు. రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌, మొబైల్‌ నంబర్‌కు లింక్‌ అయి ఉంటే మాత్రమే ఇస్తామని మరో నిబంధన తీసుకురావడంతో పూర్తి స్థాయిలో ఉచిత గ్యాస్‌ అందని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా 3 ప్రధాన కంపెనీలు, 36 ఏజెన్సీల ద్వారా గ్యాస్‌ సరఫరా జరుగుతోంది. మొత్తం 6,24,265 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో డబుల్‌ కనెక్షన్లు మినహాయిస్తే మిగిలినవి 4,09,734 ఉన్నాయి. తెల్లరేషన్‌ కార్డులు 5,42,964, అంత్యోదయ 21,591 కలిపి మొత్తం 5,64,555 ఉన్నాయి. రేషన్‌ కార్డు నిబంధనతో జిల్లాలోని 1,54,821 మందికి ఉచిత గ్యాస్‌ అందే పరిస్థితి లేకుండా పోయింది.

మహిళా మార్ట్‌తో ఆసరా

డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ‘జగనన్న మహిళా మార్ట్‌’ పేరుతో వ్యాపార సముదాయాలను గత ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇందులో మహిళలే షేర్‌ హోల్డర్లుగా వ్యవహరించే వెసులుబాటు కల్పించింది. జిల్లావ్యాప్తంగా 30,832 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో 3,08,430 మంది సభ్యులున్నారు. మహిళా మార్ట్‌లు ఏర్పాటు చేయడం ద్వారా ఖర్చులు పోను నెలకు రూ.45 వేల వరకూ డ్వాక్రా సంఘాలకు ఆదాయం లభించేలా నాటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

‘దిశ’కు ఇక్కడి నుంచే శ్రీకారం

అతివలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు, వారికి అండగా నిలిచేందుకు గత ప్రభుత్వం ‘దిశ’ పేరిట ప్రత్యేక వ్యవస్థను తీసుకు వచ్చింది. మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పేందుకు పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కకుండా పోలీసులే వారి చెంతకు వెళ్లి అండగా నిలిచి సాయం అందించేలా ఈ వ్యవస్థను రూపొందించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాజమహేంద్రవరంలో 2020లో దిశ మహిళా పోలీస్‌ స్టేషన్‌ను నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ప్రారంభించారు. దీని ద్వారా ఫోన్‌ చేసిన నిమిషాల వ్యవధిలోనే బాధితురాలికి పోలీసుల సాయం అందేది. ప్రస్తుతం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేశారు.

జగన్‌ హయాం.. మహిళాభ్యుదయం

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేశారు. సంక్షేమ పథకాలన్నీ వారి పేరిటే అందించారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, రాజకీయాల్లో మహిళల స్థానాన్ని పెంపొందించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అన్నివిధాలా సహకరించారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 84,593 స్వయం సహాయక సంఘాలకు రూ.15,969.85 కోట్ల బ్యాంక్‌ లింకేజీ రుణాలు అందజేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.

వైఎస్సార్‌ చేయూత పథకంలో భాగంగా 73,993 మందికి రూ.401.28 కోట్ల ఆర్థిక సాయం అందించారు.

వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద 33,498 స్వయం సహాయక సంఘాలకు రూ.145.94 కోట్ల వడ్డీ మంజూరు చేశారు.

వైఎస్సార్‌ ఆసరా పథకంలో భాగంగా 27,417 స్వయం సహాయక సంఘాలకు రూ.728.9 కోట్ల రుణాలు మాఫీ చేశారు.

81,141 మంది మహిళలకు రూ.374.58 కోట్ల స్రీనిధి రుణాలు అందించారు.

ఈబీసీ నేస్తంలో భాగంగా కమ్మ, రెడ్డి, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య తదితర కులాలకు చెందిన 16,218 మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఏడాదికి రూ.24.32 కోట్లు అందజేశారు.

వైఎస్సార్‌ కాపు నేస్తం పథకంలో కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన మహిళలు 824 మందికి ఏటా ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఏడాదికి రూ.44.73 కోట్ల ఆర్థిక సాయం చేశారు. ఇలా నాలుగేళ్ల పాటు అందించారు. ప్రస్తుతం ఈ వర్గాల మహిళలను పట్టించున్న వారే లేరు.

మహిళల పేరిటే ఇళ్ల స్థలాలు

పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ స్థలంతో పాటు పక్కా ఇళ్లు నిర్మించేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంటి పట్టాలు సైతం మహిళల పేరు మీదనే అందించింది. జిల్లా వ్యాప్తంగా 431 లే అవుట్లలో 65,075 ఇళ్లు మంజూరు చేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో 47,053 ఇళ్లు, ప్రైవేటు స్థలాల్లో 18,022 ఇళ్ల నిర్మాణాలకు నాంది పలికారు.

ఆడబిడ్డకు దగా1
1/4

ఆడబిడ్డకు దగా

ఆడబిడ్డకు దగా2
2/4

ఆడబిడ్డకు దగా

ఆడబిడ్డకు దగా3
3/4

ఆడబిడ్డకు దగా

ఆడబిడ్డకు దగా4
4/4

ఆడబిడ్డకు దగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement