ఏయూ డిగ్రీ ఫలితాల్లో ‘ఆదిత్య’ ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసిన డిగ్రీ ఫలితాల్లో తమ విద్యార్థులు 1, 2, 3 ర్యాంకులతో పాటు, నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి సోమవారం తెలిపారు. బీసీఏ విభాగంలో దున్నా ధనలక్ష్మి మొదటి ర్యాంక్, ఎ.పావని ఏ.క్యాతిశ్రీ రెండో ర్యాంక్, బి.శిరీష మూడో ర్యాంక్, జి.రిపిక మూడో ర్యాంక్ సాధించారన్నారు. బీబీఏ నుంచి కె.మహిత రెండో ర్యాంక్, వి.మౌనిక మూడో ర్యాంక్, జి.వెంకటసాయికీర్తి మూడో ర్యాంక్, బీఎస్సీలో ఎం.యమున ఫస్ట్ ర్యాంక్, సత్తి మోనిక విషాల్ మూడో ర్యాంక్, బీకామ్ నుంచి పి.హరిప్రియ రెండో ర్యాంక్, పి.పల్లవి మూడో ర్యాంక్ సాధించారని చెప్పారు. యూనివర్సిటీ తరఫున ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఏయూ రిజిస్ట్రార్ ఈఎన్ ధనుంజయరావు అభినందనలు తెలిపారు. ఆదిత్య కళాశాల ఉన్నత విద్యా ప్రమాణాలు, అధ్యాపకుల కార్యదక్షతను కొనియాడారు. విద్యాసంస్థల కార్యదర్శి ఎన్.సుగుణారెడ్డి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. 2024–25లో ఇప్పటి వరకూ జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 15,120 మంది విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు.
హత్యాయత్నం కేసులో నిందితుడికి జైలు
నిడదవోలు: పట్టణంలోని శెట్టిపేటకు చెందిన అడపా కోటసత్యనారాయణపై హత్యాయత్నం నేరం రుజువు కావడంతో ఏడేళ్ల జైలు, రూ.3 వేల జరిమానా విధిస్తూ సోమవారం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి జీవీఎల్ సరస్వతి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, నిడదవోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని శెట్టిపేటలో అడపా కోటసత్యనారాయణ తనకు దూరపు బంధువైన కానూరి కోటసత్యనారాయణ మధ్య పాత కక్షలున్నాయి. ఈ క్రమంలో 2016లో అడపా కోటసత్యనారాయణపై కత్తితో దాడి చేసి హతమార్చడానికి కానూరి కోటసత్యనారాయణ యత్నించాడు. దీనిపై అప్పట్లో నిడదవోలు సీఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ ఫైల్ చేశారు. విచారణ అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ కాకులపాటి వెంకటరమణ వాదించగా, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్,, ఎస్సై కె.జగన్‌మోహన్‌రావు ఈ కేసుకు సహకరించారు. కోర్టు హెచ్‌సీ సీహెచ్ కరుణాకరరావు సాక్షులను హాజరుపరిచారు.


