ఏలేరు కాలువలో పడి అమ్మమ్మ, మనవడి మృతి
ఆ కుటుంబంలో విషాద ఛాయలు
ఏలేశ్వరం: ఏలేరు కాలువలో పుణ్యస్నానం చేసేందుకు దిగి అమ్మమ్మ, మనవడు మృతిచెందిన ఘటన మండలంలోని యర్రవరంలో జరిగింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం ప్రత్తిపాడుకు చెందిన అరట్లకోట సత్యవతి(52) ఏగులమ్మ గుడి వద్ద పనులు చేస్తుంటుంది. అమ్మవారి జాతర ఉండడంతో పుణ్యస్నానం చేసేందుకు కూతురు కుమారుడైన గోర్స వీరమనోజ్(12)తో కలిసి బుధవారం సాయంత్రం యర్రవరంలోని ఏలేరుకాలువలో స్నానం చేసేందుకు దిగింది. ప్రమాదవశాత్తు కాలువలో ఉన్న గోతుల్లో మునిగిపోవడంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. కాలువలో పుణ్యస్నానం నిమిత్తం వచ్చి మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఎస్సై రామలింగేశ్వరరావు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రత్తిపాడులో విషాద ఛాయలు
ప్రత్తిపాడు: యర్రవరం వద్ద ఏలేరు కాలువలో పడి అమ్మమ్మ, మనుమడు మృతి చెందడంతో ప్రత్తిపాడులో విషాద ఛాయలు అలముకున్నాయి. వీరి మరణం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గురువారం ఏలేశ్వరం పోలీసులు శవ పరీక్షకు ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు మృతదేహాలను తరలించారు. సమాచారం అందుకున్ని మృతుల బంధువులు సీహెచ్‌సీకి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్తిపాడు సెంటర్‌లో ఉండే శ్రీఏగులమ్మ అమ్మవారి ఆలయంలో సేవ చేసుకుంటున్న విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అరట్లకట్ల సత్యవతి మృతి స్థానికులను కలచివేసింది.
ఆమె ఆలయం, పరిసరాలను శుభ్రం చేసుకుంటూ కాలం గడిపేది. గురువారం శ్రీఏగులమ్మ వారి ఆలయంలో పందిరి రాట వేసే కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశంతో నదీ స్నానం చేస్తే మంచిదని భావించిన సత్యవతి తన మనుమడు వీర మనోజ్‌ను వెంటబెట్టుకుని, ఏలేరు నదీ స్నానమాచరించేందుకు బుధవారం సాయంత్రం యర్రవరం వెళ్లింది. ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె భర్త నాగేశ్వరరావు బంధువుల ఇంట గాలించాడు. గురువారం ఉదయం ఏలేరులో శవమై తేలడంతో నిశ్చేష్టుడయ్యాడు. ఇల్లాలు శవమై రావడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. భర్త కమ్మరం పని చేసి, తెచ్చే సంపాదనతోనే కుటుంబం నడుస్తోంది. ఆమెకు ముగ్గురు కుమార్తెల సంతానం. వారందరికీ వివాహాలు చేసింది. ఆమె మరణం ఆలయ పరిసర ప్రజలను కలచివేసింది.
కాగా సత్యవతి కుమార్తె గోర్స రమణమ్మ, రాజు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే రాజు పెద్ద కుమారుడు వీర మనోజ్ (12) స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. అమ్మమ్మకు సాయంగా వెళ్లి మృత్యువాత పడ్డాడు. చేతికి అందివస్తాడనుకొన్న కొడుకు తమను వదిలిపోవడంతో ఆ దంపతుల శోకానికి అంతులేకపోయింది. తమకు తల కొరివి పెడతాడనుకొన్న కొడుకుకు తామే కొరివి పెట్టాల్సి వస్తుందని భోరున విలపించారు.
పుణ్యస్నానానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..
పుణ్యస్నానానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..


