చంద్రయాన్‌–3లో మన కృష్ణమూర్తి | Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌–3లో మన కృష్ణమూర్తి

Published Thu, Sep 7 2023 2:00 AM

చంద్రయాన్‌ సక్సెస్‌ సందర్భంలో మిగిలినశాస్త్రవేత్తలతో కృష్ణమూర్తి - Sakshi

 కాకినాడ: చంద్రయాన్‌–3 విజయవంతం కావడంలో మన కాకినాడ వాసి భాగస్వామ్యం కూడా ఉందన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. దేశమంతటా చంద్రయాన్‌ సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడే పుట్టి చదువుకున్న శాస్త్రవేత్త పాత్ర ఉంది. ఆయనే కాకినాడ జగన్నాథపురం ఎంఎస్‌ఎన్‌ చార్టీస్‌లో చదువుకున్న కేవీ కృష్ణమూర్తి. ఆయన ఇస్రోలో స్పేస్‌ క్రాఫ్ట్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌ గ్రూపులో డ్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ప్రాథమిక విద్య అనంతరం సాంకేతిక విద్యపై ఆసక్తితో ఆంధ్రా పాలిటెక్నిక్‌లో మెకానికల్‌ పూర్తి చేశారు.

దివంగత కొల్లూరు శ్రీరామమూర్తి అవధాని, లక్ష్మీసోదమ్మల నాలుగో సంతానం ఆయన. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరి, అక్కడ ఎస్‌వీ రాజగోపాల్‌ ప్రోద్బలంతో ఏఎంఐఈఈలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఆ తరువాత బెంగళూరులోని లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌ సెంటర్‌ బదిలీ అయ్యారు. అక్కడ స్పేస్‌ క్రాఫ్ట్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌ గ్రూపులో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. చంద్రయాన్‌–3లో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, ల్యాండర్‌ మాడ్యూల్‌కు పీఎస్‌ఐ పూర్తి చేయడంలో కీలక పాత్ర వహించారు.

ఈ ప్రక్రియ ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు దోహదపడిందని ఆయన తెలిపారు. చంద్రయాన్‌–3 మిషన్‌ ఆపరేషన్‌లో ఆయన 45 రోజుల పాటు ఇతర శాస్త్రవేత్తలతో కలసి శ్రమించారు. ప్రస్తుతం ఆయన గగన్‌యాన్‌ ప్రాజెక్టులో కూడా పని చేస్తున్నారు. ఇస్రోలో 38 ఏళ్ల కెరీర్‌లో కృష్ణమూర్తి మూడు ప్రాజెక్టులకు డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పని చేశారు.

చంద్రయాన్‌–3 సక్సెస్‌ సమయంలో చివరి 17 నిమిషాలు నరాలు తెగేంత ఉత్కంఠను అనుభవించామని సాఫ్ట్‌ ల్యాండింగ్‌తో ఊపిరి పీల్చుకున్నామని కాకినాడలోని ఆయన కుటుంబ సభ్యులు సంతోషంగా చెప్పారు. ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ సామర్థ్యం, ఇతర కేంద్రాల డైరెక్టర్ల మార్గదర్శకాలతో చేసిన సమష్టి కృషితో ఇది సాధ్యమైందని, ఈ మొత్తం ప్రాజెక్టులో తమ వాడు ఉండటం గర్వంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంతోషం వెలిబుచ్చారు. కాగా ఆదిత్య ఎల్‌–1 శాటిలైన్‌లో ప్రొపల్షన్‌ సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌ కూడా కృష్ణమూర్తి ఆధ్వర్యంలోనే జరిగిందని అంటున్నారు.

కాకినాడ వాసి కృష్ణమూర్తి
1/1

కాకినాడ వాసి కృష్ణమూర్తి

Advertisement
Advertisement