పుష్కర నీరాజనం
నిత్య కల్యాణస్వామికి
పుష్కర నదీ స్నాన ఫలం
పుష్కరాల సమయంలో ఆయా నదులలో స్నానం చేయడం ద్వారా సర్వపాపాలు తొలగి పుణ్య ఫలం దక్కుతుంది. ఏటా ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. ఆ 12 నదుల్లోనూ పుష్కరాల సమయంలో స్నానాలు చేయడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఈ కారణంగానే మురుమళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో 12 నదుల పుష్కర జలాలతో అభిషేకం చేస్తున్నాం. – గంటి సుబ్రహ్మణ్యశాస్త్రి,
వేద పండితులు, వీరేశ్వర స్వామి ఆలయం, మురమళ్ల
● శివరాత్రి సందర్భంగా వీరేశ్వరునికి పవిత్ర నదీ జలాలతో అభిషేకం
● పుష్కర కాలాల్లో పవిత్ర జలాల సేకరణ
● 2009 నుంచి మొదలై ఏటా
నిరంతరాయంగా నిర్వహణ
● విశేషంగా ఆదరిస్తున్న భక్తకోటి
ఐ.పోలవరం: దేశంలో పుష్కరాలు జరిగే నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో జరిగే అభిషేకానికి నిత్య కల్యాణ వీరేశ్వరుడు సిద్ధమవుతున్నాడు. మహా శివరాత్రి పర్వదినాన ఉత్తర, దక్షణాది ప్రాంతాలలోని ద్వాదశ పుష్కర నదీ జలాలతో వీరేశ్వరుని అభిషేకించనున్నారు. పుష్కరాలు నిర్వహించే కాశ్మీర్‌లోని సింధు నది మొదలుకొని గంగ, యమున, నర్మద, సరస్వతి, గోదావరి, కృష్ణ, భీమ, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, ప్రాణహిత, కావేరి వరకు మహిమాన్విత నదీ జలాలు ఇప్పటికే మురమళ్ల చేరుకున్నాయి. కనుల వైకుంఠంగా సాగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాదిమంది భక్తులు వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు.
నిత్యకల్యాణం.. పచ్చ తోరణంగా విరాజిల్లే స్థానిక భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామికి ఏటా జరిగే ద్వాదశ పుష్కర జలాల అభిషేకానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐదు రోజుల పాటు జరిగే శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా 15వ తేదీ ఆదివారం మహా శివరాత్రి పర్వదినాన ఈ పుష్కర నదీ జలాల అభిషేకం జరగనుంది.
దేశంలో ప్రతి నదికి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో సేకరించిన నదీ జలాలకు ఓ ప్రత్యేకమైన మహిమ, లేదా శక్తి ఉంటుందన్నది ఓ నమ్మకం. ఇక్కడి స్వామివారికి నిర్వహించే పుష్కర నదీ జలాభిషేకానికి నెల రోజుల ముందుగానే ఆయా 12 నదుల వద్దకు వెళ్లి ఆ జలాలను సేకరించి తీసుకువస్తారు. అది కూడా ఎలా పడితే అలా కాకుండా నదిని ఆనుకుని ఉన్న ప్రత్యేకమైన ప్రాంతం నుంచి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సేకరించి తీసుకు వస్తారు. ఇలా తెచ్చిన నీటిని మహాశివరాత్రి రోజున వీరేశ్వర స్వామికి అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
దేశంలో ప్రతి 12 ఏళ్లకు పుష్కరాలు జరిగే గంగ, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణా, కావేరి, భీమరధి, పుష్కరణి, తుంగభద్ర, సింధు, ప్రణీత నదుల నుండి సేకరించిన జలాలతో స్వామి వారికి పుష్కర నదీ జలాభిషేకం చేయనున్నారు.
నిత్య కళ్యాణ స్వామి వీరేశ్వరునికి 2009వ సంవత్సరం నుంచి పుష్కర నదీ జలాలతో అభిషేకం చేయడం మొదలుపెట్టారు. నాటి నుంచి ఏటా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ నిర్వహించే పుష్కర జలాభిషేకానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి జన జాతరను తలపిస్తారు. పుష్కర జలాల అభిషేకానికి ముందు స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ, లక్ష పత్రి పూజ, వేదమంత్రాలతో కై లాసమే భువికి దిగివచ్చిందా అన్నట్టు.
పుష్కరాలు జరిగే పన్నెండు నదులకు సామాన్యులు వెళ్లే అవకాశం ఉండదు. అలా వెళ్లలేని వారికి పుష్కర నదీ స్నాన ఫలితాన్ని అందించేందుకు వీరేశ్వరుని ఆలయంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. పుష్కర నదీ జలాలతో స్వామివారిని అభిషేకించి అనంతరం ఆ జలాలను అక్కడికి వచ్చిన భక్తులకు, స్వామి సేవకులకు ప్రసాదంగా అందజేయనున్నారు. వీటిని కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల శిరస్సున చల్లడం ద్వారా పన్నెండు నదులలో పుష్కర స్నానం చేసిన పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఒక వైపు మహా శివరాత్రి పర్వదినం.. మరోవైపు పుష్కర నది జలాభిషేకంతో మురమళ్ల, పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది.
ప్రతిష్టాత్మకంగా పుష్కర నది జలాభిషేకం
వీరేశ్వర స్వామి ఆలయంలో ఏటా జరిగే పుష్కర నది జలాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. స్వామివారికి జరిగే ఈ పుష్కర నది జలాభిషేకంలో ప్రతి భక్తుడు పాల్గొనాలని మా ఆకాంక్ష.
– వి.సత్యనారాయణ, ఈఓ,
వీరేశ్వరస్వామి వారి ఆలయం,
మురమళ్ల
పుష్కర నీరాజనం
పుష్కర నీరాజనం
పుష్కర నీరాజనం


