నింద వేయడం చంద్రబాబు నైజం
ఫ జగన్ హయాంలో అప్పుల గురించి అబద్ధాలు ప్రచారం చేశారు
ఫ అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బ తీశారు
ఫ శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపడేలా చేయడమే ఉద్దేశ్యమా?
ఫ రాజకీయ లబ్ధి కోసం ఎంతకై నా తెగించడం దారుణం
ఫ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు
రాజమహేంద్రవరం రూరల్: ఎదుటి వారిపై నింద వేయడం, దాని నుంచి లబ్ధి పొందాలని చూడడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటని, అందుకే పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. శాటిలైట్ సిటీ గ్రామంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే..
ఫ ఎన్నికల ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు అంటూ గగ్గోలు పెట్టారు. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పు రూ.7 లక్షల కోట్లేనని, అందులో జగన్ హయాంలో చేసినవి రూ.3.27 లక్షల కోట్లేనని చెప్పారు. దీనినిబట్టి ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పింది నిజం కాదనే విషయం తేటతెల్లమైంది. జగన్ దిగిపోయే సమయానికి ఖజానాలో రూ.7 వేల కోట్ల మిగులున్నప్పటికీ ఈ 20 నెలల్లో రూ.3.27 లక్షల కోట్ల అప్పులు ఎలా చేశారు? దీని నుంచి తప్పించుకోవడానికి ఒక్కో రోజు ఒక్కో ఎత్తుగడ వేస్తున్నారు. సంక్షేమం అమలు చేయకుండా, అప్పులు పెంచుకుంటూ పోతున్నారు. ప్రజల ఆస్తుల్ని ఇష్టానుసారం నచ్చిన వాళ్లకు పంచేస్తున్నారు. లేనిది భ్రమగా చూపించి గొప్పగా చేసినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు.
ఫ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ వంటివి కలిశాయంటూ గతంలో నింద వేశారు. దీనిపై ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారంటూ సుప్రీకోర్టు హెచ్చరించింది. చంద్రబాబు వ్యాఖ్యలతో శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపడ్డాయి. దీనిపై సుప్రీంకోర్టు వేసిన సిట్ తన దర్యాప్తు అనంతరం, సమర్పించిన చార్జిషీట్‌లో లడ్డూలో జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలవలేదనే విషయాన్ని నిర్ధారించింది. శ్రీవారే ఈవిధంగా నిజాన్ని పలికించారని భక్తులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో లడ్డూలో బాత్ రూము క్లీనింగ్ యాసిడ్‌లు కలిశాయంటూ చంద్రబాబు చెప్పడం దారుణం. సిట్ ఈవిధంగా ఎక్కడ చెప్పింది? ఇది బాధ్యతారాహిత్యం కాదా? భక్తులు అడగలేరని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారా? ఏదోవిధంగా జగన్‌ను అణగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నంలో ఎవరిపై నిందలు వేస్తున్నారో తెలుస్తోందా? శ్రీవారి ప్రసాదంపై లేనిపోని నిందలు వేసి, భక్తుల మనసుల్ని విరిచేస్తున్నారు. చంద్రబాబు శ్రీవారి నిజమైన భక్తుడు కానందువల్లనే రాజకీయ ప్రయోజనం కోసం ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
ఫ ఇటీవల విలేకర్ల సమావేశంలో చంద్రబాబు సహా తొమ్మిది మంది కూర్చుని మాట్లాడినపుడే ఆయన మాటలు నిజం కాదని తెలిసిపోయింది. రాజకీయ ప్రయోజనాన్ని ఆశించే ఇలా తప్పుడు ప్రచారం చేశారనే విషయం మీ ప్రెస్‌మీట్ ద్వారా ప్రజలకు, భక్తులకు అర్థమైంది. కేవలం జగన్‌ను ప్రజలో పలుచన చేయడానికి అబద్ధం చెప్పారని ప్రజలకు తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకో గాయం చేస్తున్నారు. శ్రీశైలం ప్రసాదంలో అపవిత్రత గురించి వార్తలు వస్తున్నాయంటూ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు దారుణంగా వ్యవహరిస్తున్నారా? స్వామివారి పట్ల అపచారం చేసే వ్యాఖ్యలు చేసిన వ్యక్తిగా చరిత్రలో చంద్రబాబు నిలిచిపోతారు. ఇప్పటికై నా భక్తులు వాస్తవాలు ఆలోచించి, చంద్రబాబు దుష్ప్రచారాన్ని, నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి.


