జనసేనలో గలాటా | - | Sakshi
Sakshi News home page

జనసేనలో గలాటా

Jun 18 2023 9:30 AM | Updated on Jun 18 2023 9:47 AM

ఘర్షణకు దిగిన జనసేన వర్గాలు  - Sakshi

ఘర్షణకు దిగిన జనసేన వర్గాలు

అమలాపురం రూరల్‌: అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర నిర్వహణకు సంబంధించి జనసేన పార్టీ నిర్వహించిన సమావేశం వర్గపోరుకు వేదిక అయ్యింది. పార్టీలోని ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ నెల 21న పేరూరు తోట్లపాలెం బీఆర్‌కే కన్వెన్షన్‌ హాలు వద్ద పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర జరగనుంది. ఇక్కడ నిర్వహించే నియోజకవర్గ స్థాయి సభకు జన సమీకరణ కోసం శనివారం రాత్రి నాయకులు సమావేశమయ్యారు. దీనికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

పార్టీ కో ఆర్డినేటర్లు సుందరపు విజయకుమార్‌, మర్రిడ్డి శ్రీనివాస్‌, అత్తి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శెట్టిబత్తుల రాజబాబు మాట్లాడుతూ, నియోజకవర్గంలో వారాహి యాత్ర అద్భుతంగా సాగాలని అన్నారు. అంతలోనే ఆయన వ్యతిరేక వర్గం తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. దీంతో రాజబాబు వారికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. ఆ వర్గం నాయకులు కూడా వారాహి యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఇంతలో జనసేన రూరల్‌ మండల అధ్యక్షుడు లింగోలు పండు మాట్లాడుతూ, గతం నుంచీ జరుగుతున్న వివాదాలపై ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. దీంతో ‘తరువాత మాట్లాడుకుందాం.

ఇది వారాహి యాత్ర విజయవంతం చేయటానికి ఏర్పాటు చేసిన సమావేశం’ అని కో ఆర్డినేటర్లు అడ్డుకున్నారు. దీనికి అంగీకరించని పండు.. ‘కుదరదు ఇప్పుడే తేల్చాలి’ అంటూ పట్టుబట్టారు. దీంతో ఈ సమావేశం కాస్తా రసాభాసగా మారింది. ఇరువర్గాల వారూ పరస్పరం కలబడ్డారు. ఒకరిని ఒకరు తోసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది. చివరకు పెద్దలు కల్పించుకుని సర్దుబాటు చేశారు. ఈ ఘర్షణపై సమాచారం రావడంతో పట్టణ, రూరల్‌ సీఐలు దుర్గాశేఖర్‌రెడ్డి, వీరబాబు సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. అప్పటికే అంతా సర్దుమణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement