కోరుకొండలో ఘనంగా పండిత సదస్యం
మధురపూడి: కల్యాణమూర్తులుగా కొలువుదీరిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పండితులు వేదాశీర్వచనం చేశారు. వారి వేదమంత్ర ఘోష గ్రామంలో ప్రతిధ్వనించింది. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం ఆలయంలో పండిత సదస్యం ఘనంగా నిర్వహించారు. అర్చకులు ఉదయం ఆలయం తలుపులు తెరిచి సుప్రభాత సేవ అనంతరం స్వామివారి దర్శనాలకు అనుమతించారు. అనంతరం గ్రామ బలిహరణ, 9 గంటలకు సేవాకాలం, తీర్థ, ప్రసాద గోష్టి శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు స్వామి వారి కల్యాణ మండపంలో వేద పండితుల సమక్షంలో సదస్యం నిర్వహించారు.
ఈ సందర్భంగా అన్నవరం దేవస్థానానికి చెందిన నలుగురు వేద పండితులను ఘనంగా సత్కరించారు. రాత్రి 9 గంటలకు ఆంజనేయ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. దేవస్థానం నుంచి రెడ్డి పంతులు సత్రం, పాత సంత మార్కెట్, సాయిబాబా గుడి, అంకాలమ్మ దేవాలయం, శివాలయం మీదుగా గ్రామోత్సవం తిరిగి ఆలయానికి చేరుకుంది. కల్యాణోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో కోరుకొండ కిటకిటలాడింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యాన సాయంత్రం బూర్లు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ ఎస్పీ రంగరాజ భట్టర్, ఎస్పీ నృసింహస్వామిరాజు భట్టర్, అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు తాడి రజనీరెడ్డి, అన్నవరం దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
ద్వారకా తిరుమలలో 22న ఉగాది వేడుకలు
ద్వారకా తిరుమల: చిన వెంకన్న దివ్యక్షేత్రంలో ఈ నెల 22న శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని ఈఓ వేండ్ర త్రినాథరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీవారి ప్రధానాలయంతో పాటు, ఉత్సవం జరిగే ఉగాది మండపాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తామన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఆలయం నుంచి ఉభయ దేవేరులతో కలసి స్వామివారు వెండి శేషవాహనంపై ఉగాది మండపం వద్దకు ఊరేగింపుగా తరలివెళతారని తెలిపారు. అక్కడ పంచాంగ శ్రవణం అనంతరం పండిత సత్కారం జరుగుతుందన్నారు. అనంతరం శ్రీవారి గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహిస్తామని తెలిపారు.
జీడిమామిడి, జామాయిల్ తోటలు దగ్ధం
తాళ్లపూడి: తాడిపూడి పంచాయతీ బయ్యవరం కొండ ప్రాంతంలో ఆదివారం పలు తోటలు ముఖ్యంగా జీడిమామిడి, జామాయిల్ తోటలు దగ్ధమయ్యాయి. సుమారు 25 ఎకరాల వరకూ నష్టం వాటిల్లినట్టు సమాచారం. మంటలను ఆర్పడానికి రైతులు తీవ్రంగా శ్రమించారు. కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది ఎండీ బేగ్, కేవీ రెడ్డి తదితరులు ఫైరింజన్ సాయంతో మంటలను అదుపు చేశారు. అప్పటికే చాలా వరకూ తోటలు కాలిపోయాయని రైతులు వాపోతున్నారు. రాగోలపల్లికి చెందిన రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. తహసీల్దార్ టి.రాధిక, ఆర్‌ఐ క్రాంతిరేఖ, వీఆర్‌ఓ లీలావతి, సర్పంచ్ నామా గోపాలం తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకుంటున్నారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
సదస్యం నిర్వహిస్తున్న వేద పండితులు
ప్రమాదంలో కాలిపోతున్న జామాయిల్ తోట


