అ‘గౌరవం’పై ఇక న్యాయపోరాటమే! | - | Sakshi
Sakshi News home page

అ‘గౌరవం’పై ఇక న్యాయపోరాటమే!

Aug 25 2026 12:21 AM | Updated on Aug 25 2026 12:21 AM

కొత్తపేట: మండల ప్రజా పరిషత్‌, జిల్లా ప్రజా పరిషత్‌ ప్రతినిధుల గౌరవ వేతనం చెల్లింపు అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. 80 శాతం స్థానిక సంస్థలు వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే ఉండటమే దానికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఒక్క నెల గౌరవ వేతనం కూడా చెల్లించకపోవడం గమనార్హం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ పరిధిలో 62 మంది జెడ్పీటీసీలు, 62 మంది ఎంపీపీలు, 1,184 మంది ఎంపీటీసీలు ఉన్నారు. 2021 సెప్టెంబర్‌ చివరి వారంలో వారు ప్రమాణస్వీకారం చేయగా అక్టోబర్‌ నుంచి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో 2023 మే వరకు రెండు విడతలుగా వేతనాలు చెల్లించింది. 2024లో బిల్లు పెట్టి మూడో విడత చెల్లించేందుకు చర్యలు తీసుకునే సమయంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో ఆ ప్రభుత్వం చెల్లించలేకపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకు వారికి వేతనాలు ఇవ్వలేదు. వారి పదవీ కాలం సెప్టెంబరు 24తో ముగియనుంది. ఆ నెలతో కలిపి 40 నెలలకు, జెడ్పీటీసీ సభ్యులకు 13 నెలలకు వేతనాలు చెల్లించాల్సి ఉంది.

మొదటికే మోసం..

సర్పంచ్‌ల నుంచి జెడ్పీ చైర్మన్ల వరకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని పెంచుతామంటూ 2024 ఎన్నికలప్పుడు ఊదరగొట్టిన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి నాయకులు, తీరా అధికారంలోకి వచ్చాక వారికి మొండిచేయి చూపారు. వేతనాలు పెంచడం అటుంచి కనీసం అసలు వేతనాలు కూడా చెల్లించలేదు. ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు నెలకు రూ.6 వేలు చొఽప్పున, ఎంపీటీసీ సభ్యులకు రూ.3 వేలు చొప్పున గౌరవ వేతనం కాగా ఆ చిన్నమొత్తాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా తాత్సారం చేస్తూ వస్తోంది. గౌరవ వేతనాల కోసం ఎంపీటీసీ సభ్యులు అధికారులు, ఎమ్మెల్యేల ద్వారా అనేకసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. మండల ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశాల్లో తీర్మానాలు కూడా చేశారు. పలు మండలాల్లో సర్వసభ్య సమావేశాల్లో సైతం పార్టీ రహితంగా ధర్నాలు చేశారు.

పామూరు ఎంపీపీ బాటలో న్యాయస్థానానికి..

ప్రభుత్వం స్థానిక ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం చెల్లించకపోవడంపై ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు ఎంపీపీ గంగసాని లక్ష్మి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఆ పిల్‌ను స్వీకరించిన హైకోర్టు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫలితంగా ఆమెతో పాటు 13 మందికి ఖాతాల్లో 27 నెలల వేతనం జమ అయ్యింది. ఎంపీపీ లక్ష్మి బాటలో జిల్లాలో పలువురు ఎంపీపీలు తమ మండలాల పరిధిలోని ఎంపీటీసీ సభ్యులతో హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

ఎంపీపీ, జెడ్పీటీసీలకు గౌరవ వేతనం

విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం

అత్యధికంగా వైఎస్సార్‌సీపీ

సభ్యులనే కారణంతో చిన్నచూపు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో

62 మంది ఎంపీపీలు,

62 మంది జెడ్పీటీసీలు,

1,184 మంది ఎంపీటీసీలు

వచ్చే నెలతో ముగియనున్న పదవీకాలం

మొత్తం 40 నెలలకు వేతనాల బకాయి

ప్రభుత్వంపై నమ్మకం లేక

న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు

సిద్ధమైన ప్రజాప్రతినిధులు

నిధులు లేవు.. విధులు లేవు

ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎంపీటీసీ సభ్యులకు గౌరవ వేతనాలు ఇవ్వకపోవడమే కాదు.. తమ పరిస్థితిని మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశాలకు మాత్రమే పరిమితం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంపీటీసీ సభ్యులకు నిధులు లేవు.. విధులు లేవు. గౌరవ వేతనాలైనా వెంటనే విడుదల చేయాలి.

– నేలపూడి భీమరాజు, ఎంపీటీసీ సభ్యుడు, వాడపాలెం

గౌరవ వేతనం విడుదల చేయాలి

కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచింది. మాకు ఇప్పటికీ గౌరవ వేతనాలు ఇవ్వలేదు. మూడేళ్లకు పైగా చెల్లించవలసి ఉంది. మూడు నెలలకు ఒకసారి మండల పరిషత్‌ సమావేశానికి వెళ్లడం తప్ప అంతకు మించి గౌరవం కనిపించలేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గౌరవ వేతనం నిధులు విడుదల చేయాలి.

– దూళి సూరిబాబు, ఎంపీటీసీ సభ్యుడు, అవిడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement