రండి రెండోస్సారి..! | - | Sakshi
Sakshi News home page

రండి రెండోస్సారి..!

Aug 24 2026 12:13 AM | Updated on Aug 24 2026 12:13 AM

మ్యాపింగ్‌ కాని ఓటర్లకు

ఎన్నికల అధికారుల నోటీసులు

57,902 మందికి తప్పని తిప్పలు

‘కొత్తపేట’లో అత్యధికంగా

18,845 జారీ

రాకుంటే ఓటు కోల్పోయినట్టేనని

హెచ్చరిక

సాక్షి, అమలాపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా (సర్‌) కోనసీమ జిల్లాలో నోటీసులు అందుకున్న ఓటర్లకు కీలక దశ మొదలైంది. 2002 ఓటర్ల జాబితాతో ప్రస్తుత ఓటరు వివరాలు మ్యాపింగ్‌ కాకపోవడం, వివరాల్లో వ్యత్యాసాలు ఉండడం వంటి కారణాలతో జిల్లాలో 57,902 మందికి నోటీసులు జారీ అయ్యాయి. వీరిలో అత్యధికంగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో 18,845 మంది ఉన్నారు. నోటీసులు అందుకున్న వారు సంబంధిత అధికారులు నిర్వహించే విచారణకు హాజరై తమ వివరాలను ధ్రువీకరించుకోవాల్సి ఉంది. లేకుంటే ఓటు కోల్పోయే ప్రమాదముంది.

హాజరుకాకుంటే ఇబ్బందులే

నోటీసు అందుకున్న ఓటర్లు నిర్దేశిత తేదీ, కేంద్రంలో నిర్వహించే విచారణకు హాజరై తమ వాదన వినిపించాల్సి ఉంది. పుట్టిన తేదీ, స్థలం, తల్లిదండ్రుల వివరాలు, నివాసానికి సంబంధించిన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. 2002 ఓటరు జాబితాలో తమ పేరు లేదా తల్లిదండ్రుల పేరు ఉంటే ఆ వివరాల ఆధారంగా మ్యాపింగ్‌ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. పేర్లు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు అవసరమైన ఆధారాలను సమర్పించాలి. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, నోటీసు అందుకున్న వారి గత వివరాలు అందుబాటులో లేకపోయినా లేదా ప్రస్తుత వివరాలతో సరిపోలకపోయినా నోటీసు జారీ చేసి పత్రాలు సమర్పించే అవకాశం కల్పిస్తారు.

కొంతమందికి రెండవసారి..

నోటీసు అందుకున్న ఓటర్లకు ప్రస్తుతం తమ ఓటు హక్కును ధ్రువీకరించుకునే కీలక అవకాశం ఉంది. విచారణకు గైర్హాజరై తమ వివరాలకు సంబంధించి వివరణ, ఆధారాలు సమర్పించకపోతే ఓటు కోల్పోయే ప్రమాదముంది. నోటీసులో పేర్కొన్న తేదీ, సమయానికి సంబంధిత కేంద్రానికి వెళ్లి ఆధారాలను సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు కూడా ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇస్తున్న నోటీసులలో కొంతమంది రెండో సారి నోటీసులు పొందినవారు ఉన్నారు. ఇప్పటికే వారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. అయితే సమర్పించిన ధ్రువీకరణ పత్రాలలో తల్లి లేదా తండ్రి, ఇతర ధ్రువీకరణ పత్రాలలో ఇంటి పేర్లు, పేర్లు తేడా ఉందని రెండో సారి నోటీసులు ఇస్తున్నారు. వీరంతా మరోసారి రావాలని అధికారులు చెప్పడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇది తమను వ్యయ ప్రయాసలకు గురి చేస్తోందని వారు వాపోతున్నారు.

అత్యధిక నోటీసులు కొత్తపేటలోనే..

u కొత్తపేట నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధికంగా 18,845 నోటీసులు జనరేట్‌ అయ్యాయి. ఆత్రేయపురంలో 4,318, రావులపాలెంలో 4,439, కొత్తపేటలో 5,505, ఆలమూరులో 4,583.

u రాజోలు నియోజకవర్గంలో 14,431 నోటీసులు ఇవ్వాల్సి ఉంది. సఖినేటిపల్లిలో 707, మలికిపురంలో 5,933, రాజోలులో 6,649, మామిడికుదురులో 1,142.

u అమలాపురం నియోజకవర్గంలో 12,777 నోటీసులు ఇవ్వాల్సి ఉంది. అమలాపురం రూరల్‌లో 3,819, అమలాపురం అర్బన్‌ 4,049, అల్లవరం 3,584, ఉప్పలగుప్తం 1,325.

u ముమ్మిడివరం నియోజకవర్గంలో 7,143 నోటీసులు. ముమ్మిడివరం రూరల్‌లో 1,475, ముమ్మిడివరం అర్బన్‌ 406, కాట్రేనికోనలో 932, ఐ.పోలవరంలో 4,234, తాళ్లరేవులో 96.

u పి.గన్నవరం నియోజకవర్గంలో 3,821 మందికి నోటీసులు ఇవ్వనున్నారు. మామిడికుదురులో 763, పి.గన్నవరంలో 734, అంబాజీపేటలో 611, అయినవిల్లిలో 1,713.

u రామచంద్రపురం నియోజకవర్గంలో మొత్తం 885 మందికి నోటీసులు ఇవ్వనున్నారు. రామచంద్రపురం అర్బన్‌ 123, రామచంద్రపురం రూరల్‌ 201, కాజులూరులో 176, కె.గంగవరంలో 385 విడుదల చేశారు

మూడు పత్రాల వరకు అవసరం

నోటీసు అందుకున్న ప్రతి ఓటరు ఒకేసారి పెద్ద సంఖ్యలో ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, పదో తరగతి లేదా ఇతర విద్యా ధ్రువీకరణ పత్రం, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు, పెన్షన్‌ పత్రం, ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన పత్రాలు, అటవీ హక్కుల ధ్రువీకరణ పత్రం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువీకరణ పత్రం, కుటుంబ రిజిస్టర్‌, ఇల్లు లేదా భూ కేటాయింపు పత్రం, ఆధార్‌ తదితరాలను ఎన్నికల సంఘం సూచించిన జాబితాలో పేర్కొంది. వీటిలో కనీసం ఏవైనా మూడు పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని చెబుతున్నారు.

57,902 మందికి నోటీసులు

జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో 57,902 నోటీసులు జనరేట్‌ కాగా ఇప్పటివరకు 57,652 నోటీసులు పంపిణీ చేశారు. ఇంకా 250 నోటీసులు పంపిణీ కావాల్సి ఉంది. పంపిణీ అయిన నోటీసుల్లో కొంతమందికి ఇప్పటికే మరోసారి నోటీసులు అందినట్లు అధికారులు చెబుతున్నారు. నోటీసు అందుకున్న వారు విచారణకు హాజరై తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement