బీకేఎస్ అఖిల భారత సంఘటన
మంత్రి దినేష్ కులకర్ణి
అంబాజీపేట: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కోనసీమ రైతులు వ్యవసాయంలో నిష్ణాతులని, బీకేఎస్ అఖిలభారత సంఘటన మంత్రి దినేష్ కులకర్ణి చెప్పారు. ఆదివారం ఆయన రాష్ట్ర బీకేఎస్ అధ్యక్షుడు సహదేవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శిలతో కలసి జిల్లాకు విచ్ఛేశారు. ఈ సందర్భంగా అంబాజీపేట సొసైటీ కార్యాలయంపై ఉన్న కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చేకూరి సూర్యనారాయణ రాజు అధ్యక్షతన రైతులు, బీకేఎస్ కార్యకర్తలతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీమ రైతులు దేశానికే ఆదర్శవంతులని గతంలో క్రాప్ హాలీడే ప్రకటించి సంచలనం సృష్టించారన్నారు. ఇక్కడి రైతులు ఎంతో నైపుణ్యం గలవారన్నారు. బీకేఎస్ రైతులు ప్రతినెలా ఒకటో తేదీన ప్రాంతాల్లో సమావేశమవుతున్నారని, దీనిని ఆదర్శంగా తీసుకొని తాము కూడా తమ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించుకుంటున్నామని వివరించారు. కోనసీమలో 20 ఏళ్లుగా బీకేఎస్ కార్యకలాపాలు సాగుతున్నాయని, దేశవ్యాప్తంగా రైతులు వ్యవసాయ కూలీల సమస్యను ఎదుర్కొంటున్నారని దీని పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఇందులో భాగంగానే వీబీజీ రాంజీ ప్రవేశపెట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో అఖిల భారత బీకేఎస్ కార్యకారిణి సభ్యులు శ్రీధర్ రెడ్డి, సంఘటనా సభ్యులు దోనూరి రాము, రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్యాల జమీల్, అంబాజీపేట అధ్యక్షులు కొప్పిశెట్టి ఆనందప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


