ఘటనపై విచారణకు ఈఓ ఆదేశం
ద్వారకాతిరుమల: భక్తుల రద్దీ నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేసిన సమయంలో ఓ హోంగార్డు ఫ్రీ ఎంట్రీపాస్ (వీఐపీ పాస్)ను ఒక భక్తుడికి రూ. 500కు విక్రయించిన ఘటన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం కలకలం రేపింది. ఆ వివరాల్లోకి వెళితే.. భక్తుల రద్దీని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10.45 గంటలకే చినవెంకన్న అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేశారు. సర్వదర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలకు మాత్రమే భక్తులను అనుమతిచ్చారు. ఈ క్రమంలో ఏలూరుకు చెందిన ఇద్దరు భక్తులు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఉత్తర రాజగోపురం వద్దకు చేరుకుని రూ.500 అంతరాలయ దర్శనం టిక్కెట్లు కావాలని సిబ్బందిని కోరారు. అంతరాలయ దర్శనం నిలిపివేశామని సిబ్బంది వారికి తెలిపారు. దీంతో రూ.200 అతిశీఘ్ర దర్శనం టిక్కెట్లు ఇవ్వాలని భక్తులు కోరగా, అక్కడే ఉన్న ఓ హోంగార్డు తన వద్ద ఒక అంతరాలయ దర్శనం టిక్కెట్ ఉందని చెప్పి రూ.500 తీసుకుని, టిక్కెట్ ఇచ్చాడు. దీంతో ఇద్దరు భక్తుల్లో ఒకరు ఆ టిక్కెట్‌తో అంతరాలయ దర్శనానికి, మరొకరు రూ.200 టిక్కెట్‌తో అతిశీఘ్ర దర్శనానికి వెళ్లారు.
విషయం బయటపడింది ఇలా..
అంతరాలయ దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన భక్తుడు తన టిక్కెట్ తనకు ఇస్తే, దానికి వచ్చే రెండు లడ్డూలు తీసుకుంటానని సిబ్బందిని అడిగాడు. ఆ సమయంలో అక్కడున్న టెంపుల్ ఇన్‌స్పెక్టర్ టిక్కెట్‌ను పరిశీలించడంతో విషయం బయటపడింది. ఆ టిక్కెట్‌ను ఉదయం 8.16 గంటలకు ఉంగుటూరు ఎమ్మెల్యే రిఫరెన్స్‌తో ప్రొటోకాల్ కార్యాలయంలో జారీ చేసిన ఫ్రీ ఎంట్రీ పాస్‌గా గుర్తించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆలయ సూపరింటెండెంట్ ఐవీ రామారావు సదరు భక్తుడిని విచారించగా, హోంగార్డు నుంచి రూ. 500కు టిక్కెట్ తీసుకున్న విషయాన్ని వివరించాడు. అనంతరం సదరు హోంగార్డును సూపరింటెండెంట్ ప్రశ్నించగా.. తొలుత తన కుటుంబ సభ్యులు వచ్చారని, మరోసారి దేవస్థానం సీఎస్‌ఓ తీసుకొచ్చి ఇచ్చారని పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దాంతో భక్తుడి నుంచి సూపరింటెండెంట్ రామారావు లిఖితపూర్వక ఫిర్యాదును స్వీకరించారు. జరిగిన విషయాన్ని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సమగ్ర విచారణకు ఆదేశించారు.


