ఉప్పొంగినది.. | - | Sakshi
Sakshi News home page

ఉప్పొంగినది..

Aug 2 2026 12:16 AM | Updated on Aug 2 2026 12:16 AM

గోదావరి ఉగ్రరూపం

లంకల్లోకి చేరిన వరదనీరు

బాహ్య ప్రపంచంతో తెగిన సంబంధాలు

రాత్రికి మరింత పెరగనున్న ఉధృతి

సాక్షి, అమలాపురం: గోదావరి ఉప్పొంగుతోంది.. వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. జిల్లాలో లంక గ్రామాల్లో నీరు చొచ్చుకువస్తోంది. తాత్కాలిక మట్టి రోడ్లు కొట్టుకుపోవడం, రేవు ప్రయాణాలు నిలిపివేయడంతో లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీనితో అక్కడి ప్రజలకు కష్టాలు రెట్టింపయ్యాయి. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ నుంచి వరద నీరు పెద్దఎత్తున విడుదల చేస్తుండడంతో ఆది, సోమవారాల్లో వరద మరింత పెరిగి లంక గ్రామాలను చుట్టుముట్టనుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి రాత్రి తొమ్మిది గంటల సమయంలో 13,07,821 క్యూసెక్కుల నీరు దిగువనకు విడుదల చేశారు. రాత్రి అక్కడ రెండో ప్రమాదకర హెచ్చరిక జారీ చేశారు. ఈ వరద నీరు జిల్లాలో లంక గ్రామాలను చుట్టుముడుతోంది. వరద పి.గన్నవరం పాత అక్విడెక్టును తాకుతూ ప్రవహిస్తోంది. మురమళ్ల రాఘవేంద్ర వారిధి కింద ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ప్రమాకరంగా రాకపోకలు

గోదావరి ఉధృతి ఆది, సోమవారాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల లంక వాసుల రాకపోకలు మరింత ప్రమాదకరంగా మారనున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు, వృద్ధులు, మహిళలు, గర్భిణులు వైద్య సేవల కోసం, రైతులు వ్యవసాయ పనుల కోసం, అనారోగ్య పీడితులు ఆస్పత్రులకు వెళ్లేందుకు పడవలను ఆశ్రయించాల్సి వస్తోంది. వరద ఉధృతిలో పడవ ప్రయాణాలు ప్రమాదంగా మారడంతో ఆందోళన నెలకొంది. కె.గంగవరం మండలం కోటిపల్లి వద్ద పుష్కర మెట్లను దాటి వరద ప్రవహిస్తోంది. రాత్రికి స్థానిక మత్స్యకార కాలనీ ముంపు బారిన పడనుంది. ముమ్మిడివరం మండలం లంకాఫ్‌ ఠాన్నేల్లంక, అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లెపాలెం మత్స్యకార కాలనీలు, గురజాపులంక, కమిని గ్రామాలు నీట మునగనున్నాయి.

నిలిచిపోయిన రాకపోకలు

వరద పెరగడంతో లంక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఐ.పోలవరం మండలం జి.మూలపొలం– పల్లంకుర్రు, జి.వేమవరం – గోగుల్లంక, కొత్తలంక – కేశనకుర్రు మధ్య పడవ ప్రయాణాలను రెవెన్యూ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీనితో గోగుల్లంక, భైరవలంక గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు నిలిచిపోయాయి. పి.గన్నవరం మండలం జి.పెదపూడిలంకలో శుక్రవారం మట్టి కట్ట తెగిపోవడంతో ఇప్పటికే జి.పెదపూడిలంక, ఊడుమూడిలంక, బూరుగులంక, అరిగెలవారిపేటకు రహదారి ప్రయాణం నిలిచిపోయిన విషయం తెలిసిందే.

లంక రైతుల్లో ఆందోళన

పెరుగుతున్న వరద లంక రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రాత్రి నుంచి లోతట్టు ప్రాంతాల్లోని తోటల్లో వరద నీరు చేరుతోంది. దీర్ఘకాలిక పంటలైన కొబ్బరి, కోకో, పోక వంటి పంటలకు నష్టం ఉండదు కాని, కూరగాయ, ఆకుకూర పంటలు ధ్వంసం కానున్నాయి. అరటి, పసుపు, కంద, బొప్పాయి, తమలపాకు తోటలకు నష్టం జరగనుంది. వరద పెరుగుతుండడంతో పశువులను, ఇంటి సామాన్లను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కొబ్బరి రాశులు, పశువులను, పశుగ్రాసాలను మెరక ప్రాంతాలకు, ఏటిగట్ల మీదకు తరలిస్తున్నారు. నదీపాయల్లో ఉన్న ఆక్వా చెరువులు ముంపుబారిన పడే అవకాశం ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, అల్లవరం, పి.గన్నవరం, మలికిపురం, మామిడికుదురు మండలాల్లో ఆక్వా చెరువులు పెద్దఎత్తున దెబ్బతిననున్నాయి.

పి.గన్నవరం మండలం చాకలిపాలెం శివారు

కనకాయలంక కాజ్‌ వేపై వరద నీటిలో వస్తున్న ట్రాక్టర్‌

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద

నీటి విడుదల క్యూసెక్కుల్లో..

సమయం నీటి విడుదల

ఉదయం 6.00 8,50,534

ఉదయం 7.00 8,50,534

ఉదయం 8.00 8,93,607

ఉదయం 9.00 9,38,780

మధ్యాహ్నం 12.00 10,27,777

మధ్యాహ్నం 3.00 11,21,224

సాయంత్రం 6.00 11,98,238

సాయంత్రం 7.00 12,37,173

జిల్లాలో కంట్రోల్‌ రూమ్స్‌ నంబర్లు

కలెక్టరేట్‌ : 08856 – 293104

అమలాపురం : 08856 – 233208

రామచంద్రపురం: 08857 – 245166

కొత్తపేట : 85002 – 38258,

08855 – 244299

మునిగిన కాజ్‌వే

పి.గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద ఉన్న కనకాయలంక కాజ్‌వేపైకి వరద నీరు చేరింది. సాయంత్రం సమయానికి కాజ్‌వేపై ఐదారు అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. రాత్రికి ముంపు మరింత పెరిగే అవకాశం ఉంది. కాజ్‌వే నీట మునగడంతో పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన కనకాయలంకకు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వే, అయినవిల్లి మండలం ఎదురుబిడియం కాజ్‌వేలు నీట మునిగే అవకాశముంది. ముక్తేశ్వరం తొగరపాయలోకి వరద నీరు ఉధృతంగా వస్తోంది. ముక్తేశ్వరం పాత వంతెనపైకి నీరు చేరింది.

బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించండి

అమలాపురం రూరల్‌: వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి వరద పరిస్థితులపై జిల్లా స్థాయి అధికారులతో ఆయన శనివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరద ప్రభావిత గ్రామాల్లో సహాయక శిబిరాలు, అవసరమైన సామగ్రి, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో స్థానిక యంత్రాంగం, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో సురక్షిత రవాణా ఏర్పాట్లు చేయాలని అన్నారు. మామిడికుదురు మండలం అప్పనపల్లి బాలబాలాజీ ఆలయంతో పాటు స్నాన ఘట్టాల వద్ద భక్తుల భద్రతకు తగిన ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఫ ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ వైఖోం నైదియాదేవి అన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ చాంబర్‌లో అధికారులతో ఆమె సమీక్షించారు.

ఫ పి.గన్నవరం మండలంలో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో సుమారు 310 కుటుంబాలకు అవసరమైన నిత్యావసర వస్తువులను ముందుగానే అందుబాటులో ఉంచామని తెలిపారు. కలెక్టరేట్‌లో 24 గంటల పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్‌ 08856–293104కు ఫోన్‌ చేయవచ్చన్నారు. పాడి రైతులు తమ పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement