● ముద్రగడ సంస్మరణ సభకు
ఉవ్వెత్తున అభిమాన తరంగం
● కిక్కిరిసిన సభా ప్రాంగణం
● మహానేతకు అంజలి ఘటించిన ప్రముఖులు
కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ శనివారం కిర్లంపూడిలోని ముద్రగడ నివాస ప్రాంగణంలో జరిగింది. దీనికి మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జగ్గంపేట కోఆర్డినేటర్ తోట నరసింహం అధ్యక్షత వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సభను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ప్రారంభించారు. ముద్రగడ కుమారుడు, వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పార్టీ శ్రేణులతో కలసి ముద్రగడ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. సభకు ముఖ్య అతిథులుగా హాజరైన వైఎస్సార్ సీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ముద్రగడ చేపట్టిన ప్రతి ఉద్యమంలో ప్రజల, జాతి సంక్షేమం ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ముద్రగడ అండగా నిలిచేవారన్నారు. మాజీ మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన గొప్ప నాయకుడు ముద్రగడ మన మధ్యలో లేకపోవడం బాధాకరమన్నారు. మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ముద్రగడ ఏ ఉద్యమం తలపెట్టినా, గుండె నిండా దృఢ సంకల్పంతో ముందుకు సాగేవారన్నారు. మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ముద్రగడ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఐదు శాతం రిజర్వేషన్ ఎవరికి ఇచ్చారో..
కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని, ఏ రూపంలో ఆ రిజర్వేషన్ ఇచ్చిందో చెప్పాలంటూ మాజీ మంత్రి తోట త్రిమూర్తులు ప్రభుత్వాన్ని నిలదీశారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ దివంగత ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటు అని అన్నారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ జాతి కోసం, తను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప నాయకుడు ముద్రగడ అన్నారు. కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ముద్రగడ తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారన్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ నేటితరం రాజకీయాల్లో ముద్రగడ లాంటి నాయకుడిని మళ్లీ చూడలేమన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ నీతి నిజాయతీలకు మారుపేరుగా ముద్రగడ నిలిచారని కొనియాడారు.


