పి.గన్నవరం: మండలంలోని నాలుగు లంక గ్రామాల ప్రజల కష్టాలు తీర్చేందుకు వశిష్ట నదీపాయపై గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ఊడిమూడిలంక వంతెన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజలు వశిష్ట నదీపాయలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయిన నేపథ్యంలో బూరుగులంక రేవును పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావుతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. లంక గ్రామాల ప్రజలతో జగ్గిరెడ్డి మాట్లాడి, వారి కష్టాలు తెలుసుకున్నారు. గోదావరిలో వరద ఉధృతి పెరిగి సుమారు 17 లంక గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక ప్రజలు వశిష్ట నదిపై వంతెన నిర్మించాలని కోరిన నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో ఈ బ్రిడ్జికి నిధులు మంజూరు చేసి పనులకు శ్రీకారం చుట్టారని, అనంతరం వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పనులు ముందుకు సాగలేదన్నారు. తర్వాత గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంతాన్ని సందర్శించి, ప్రజల విన్నపం మేరకు వంతెన నిర్మాణానికి అన్ని క్లియరెన్స్‌లు ఇచ్చి, మళ్లీ పనులు వేగవంతం చేశారని గుర్తు చేశారు. ఆయన చొరవతో ఇప్పటికి 80 శాతం నిర్మాణం పూర్తయ్యిందని చెప్పారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించకుండా, వెంటనే నిధులు విడుదల చేసి మిగిలిన పనులు పూర్తి చేయాలన్నారు. పలు లంక గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించి ఇప్పటికే 24 గంటలు దాటిందని, బాధితులకు వెంటనే వరద సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వరద ప్రభావిత కుటుంబాలకు తక్షణమే బియ్యం, కిరోసిన్, వంటనూనె, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి నిత్యావసర వస్తువులు అందించేవారని గుర్తు చేశారు. లంక గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులను అన్నివిధాలా ఆదుకోవాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. కోఆర్డినేటర్ గన్నవరపు మాట్లాడుతూ వరదలు తగ్గే వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం తహసీల్దార్ పి.శ్రీపల్లవితో జగ్గిరెడ్డి మాట్లాడి, ప్రజలకు సహాయక చర్యలు అందించాలని కోరారు. పార్టీ రాష్ట్ర నాయకులు పితాని నరసింహరావు, వాసంశెట్టి తాతాజీ, మిండగుదిటి శిరీష్, దంగేటి అన్నవరం తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి


