జిల్లా యంత్రాంగం అప్రమత్తం
కలెక్టర్ మహేష్ కుమార్
గోదావరి వరదలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 19 మండలాల్లో వరద ప్రభావం ఉంటుందని, ప్రత్యేకంగా సెంట్రల్ డెల్టాలోని 16 నుంచి 17 మండలాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మోటరైజ్డ్ బోట్లు, లైఫ్ జాకెట్లు, ఈతగాళ్లను సిద్ధం చేశామని, అన్ని శాఖల అధికారులనూ అప్రమత్తం చేశామని తెలిపారు. అధికారులకు మూడు నాలుగు రోజుల పాటు సెలవులు రద్దు చేశామన్నారు. లంక గ్రామాల్లో బియ్యం, నిత్యావసరాలు, తాగునీరు, పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకున్నామని, గర్భిణులు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు. కోటిపల్లి, నరసాపురం, సోంపల్లి వద్ద పడవ రవాణా నిలిపివేసినందున ప్రత్యామ్నాయ మార్గాలు వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సాక్షి, అమలాపురం: ఎల్‌నినో ప్రభావంతో నిన్నటి వరకూ కళ తప్పిన గోదావరికి.. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దిగువన కోనసీమ జిల్లాలో నిన్నటి వరకూ ఇసుక తిప్పలుగా కనిపించిన గోదావరి నదీపాయల్లో క్రమేపీ వరద పెరుగుతోంది. గంటగంటకూ పెరుగుతున్న వరద గోదారి.. సుడులు తిరుగుతూ సముద్రం వైపు పరుగులు తీస్తోంది. ఇసుక ర్యాంపుల కోసం, లంక వాసుల వాహనాల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారులను తెగ్గొడుతోంది. భద్రాచలం వద్ద సాయంత్రం 6 గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 49.50 అడుగులకు చేరింది. దిగువకు 12,24,69 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. మరోవైపు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తూనే ఉండటంతో వచ్చే రెండు రోజుల్లో గోదావరి వరద మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పెరిగిన ఇన్‌ఫ్లో
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో నిన్నమొన్నటి వరకూ గోదావరిలో ఇన్‌ఫ్లో కనిష్ట స్థాయిలోనే ఉంది. ఈ నెల 28న అత్యధికంగా 1.13 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే నమోదైంది. తరువాత అది మరింత తగ్గింది. కానీ, రెండు రోజులుగా గోదావరి పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆ పరిస్థితి మారిపోయింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి శుక్రవారం ఉదయం 6 గంటలకు 2,25,370 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇది మధ్యాహ్నం 3 గంటలకు 4,37,545 క్యూసెక్కులకు పెరిగింది. రాత్రి 9 గంటల సమయానికి 5,36,467 క్యూసెక్కులకు పెరిగింది. వరద ఉధృతి మరింత పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఎగువన భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం 40 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం రాత్రి 10 గంటలకు ఏకంగా 51.70 అడుగులకు పెరిగింది. మొత్తం 13,55,586 క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది.
లోతట్టు ప్రాంతాలపై ప్రభావం
ఎగువన వర్షాలు కొనసాగుతూండటంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. జిల్లాలోని గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ట గోదావరి నదీపాయలో వరద నీరు పోటెత్తుతోంది. వచ్చే 24 గంటల నుంచి వరద ప్రభావం మరింత ఎక్కువ కానుంది. లంక గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి శని, ఆదివారాల్లో వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ఇక్కడి అరటి, కొబ్బరి, ఇతర ఉద్యాన పంటలు నీట మునిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల పొలాల్లోకి నీరు చేరింది. వరద మరింత పెరిగితే రైతులు నష్టపోయే ప్రమాదముంది. ఇప్పటికే తమ పశువులను మెరక ప్రాంతాలకు, ఏటిగట్ల మీదకు తరలించేందుకు పాడి రైతులు చర్యలు మొదలు పెట్టారు.
కోనసీమను తాకిన వరద
రెండు రోజుల్లో ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం
జి.పెదపూడిలంక వద్ద కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారి
పడవల పైనే ప్రయాణాలు


