అల్లవరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషిని మరుగనపరుస్తూ, క్రెడిట్ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎంపీ చింతా అనురాధ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం వైఎస్ జగన్ దూరదృష్టికి, సంకల్పానికి ప్రతీక అని కొనియాడారు. ఉత్తరాంధ్ర భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకొని 2023లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు. విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ, రూ.1,200 కోట్ల నిధులు, అనుమతులన్నీ వైఎస్ జగన్ హయాంలోనే సాఽధించి నిర్మాణ పనులు ప్రారంభించారన్నారు. భోగాపురం నిర్వాసితులకు పరిహారం ఇవ్వడమే కాకుండా, రూ. 80 కోట్లతో టౌన్‌షిప్‌లను తలపించే విధంగా కాలనీని నిర్మించి ఇచ్చారన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో భోగాపురం విమానాశ్రయానికి కనీసం రోడ్లు వేయలేని దుస్థితి నెలకొందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అభివృద్ధిని చంద్రబాబు తన ఖాతాల్లో వేసుకునే ప్రయత్నం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అనురాధ ధ్వజమెత్తారు. విమానాశ్రయాన్ని ప్రారంభించినంత మాత్రాన చరిత్ర మార్చలేరని, పునాది నుంచి నిర్మాణం వరకు ప్రతి కీలక అడుగు వైఎస్ జగన్‌తోనే సాధ్యమైందని తెలిపారు. ఆయన కృషిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అనురాధ అన్నారు.
శ్రీనివాసా.. చిద్విలాసా
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం శనివారం భక్తులతో కిక్కిరిసింది. సుమారు 82వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఏడు శనివారాల స్వామివారి దర్శనం.. ఏడేడు జన్మల పుణ్యఫలంగా భక్తులు భావించి వర్షం పడినా అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాలభోగం వంటి పూజలు నిర్వహించారు. అలాగే ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ ఒక్కరోజు రూ.73.79 లక్షల ఆదాయం వచ్చింది.
కేంద్ర మలేరియా బృందం
పర్యటన
కొత్తపేట: కేంద్ర మలేరియా బృందం జిల్లాలో పర్యటించింది. మలేరియా కేసుల తీవ్రతను అంచనా వేయడానికి, నిర్దిష్ట జిల్లాలను మలేరియా రహిత ప్రాంతాలుగా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అధికారిక తనిఖీలో భాగంగా ముగ్గురు సభ్యులు పాల్గొన్నారు. మూడేళ్లుగా ఇక్కడ ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదని, ‘మలేరియా రహిత‘ జిల్లాగా ప్రకటించాలని జిల్లా అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ఆ ప్రతిపాదనను పరిశీలించి, క్షేత్రస్థాయిలో ధ్రువీకరించడానికి డబ్ల్యూహెచ్‌ఓ నుంచి డాక్టర్ దెబాసిస్ (ఢిల్లీ), ఎయిమ్స్ నుంచి డాక్టర్ అమిత్ (ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్), డీఎంఓ నుంచి డాక్టర్ రియాస్‌కై తా (కేరళ) అనే ముగ్గురు కేంద్ర బృంద సభ్యులు జిల్లా మలేరియా (డీఎంఓ) డాక్టర్ కేఎన్ శ్రీనివాస్‌తో కలిసి జిల్లాలో మూడు రోజుల నుంచి ద్రాక్షారామ, హసన్‌బాద, రామచంద్రపురం, అమలాపురం, కొత్తపేట, ఊబలంక, కాట్రేనికోన పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులను సందర్శించారు. కొత్తపేట సీహెచ్‌సీలో గతంలో మలేరియా కేసుల వివరాలతో పాటు రోగుల వార్డులను పరిశీలించారు. డీఎంఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


