జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు విద్యార్థుల ఎంపిక

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

అమలాపురం రూరల్‌: శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో సబ్‌ జూనియర్‌ విభాగంలో మండలం ఇందుపల్లి, సాకుర్రు హైస్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. త్వరలో అమలాపురంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వారు పాల్గొననున్నారు. 53 కేజీల విభాగంలో ఇందుపల్లి విద్యార్థులు సీహెచ్‌ సత్య గోపాల్‌, 56 కేజీల విభాగంలో బి.బాలాజీ, సాకుర్రు పాఠశాల నుంచి ఎ.అవినాష్‌ ప్రతిభ సాధించారు. డీఈఓ పి.నాగేశ్వరరావు తదితరులు విజేతలను అభినందించారు.

కనకదుర్గమ్మ చైత్ర

మాసోత్సవాలు ప్రారంభం

అన్నవరం: రత్నగిరి తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారి చైత్రమాస ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఆలయంలో పండితులు కలశ స్థాపన, మండపారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించి, ఘనంగా పూజలు చేశారు. రుత్విక్కులకు దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ మంజులాదేవి దీక్షా వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం, రుత్విక్కులు లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 17వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ అమ్మవారికి లక్ష కుంకుమార్చన, రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ గరగల సంబరం నిర్వహిస్తారని వివరించారు. ఏప్రిల్‌ 17న అమావాస్య నాడు జరిగే చండీహోమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇదిలా ఉండగా, కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం మూల సందర్భంగా అమ్మవారికి బుధవారం చండీహోమం నిర్వహించారు.

కనకదుర్గమ్మకు

సత్యదేవుని తరఫున సారె

అన్నవరం: సత్యదేవుని తోబుట్టువుగా రత్నగిరి తొలి పావంచా వద్ద కొలువు తీరిన కనకదుర్గ అమ్మవారికి చైత్ర మాసోత్సవాల సందర్భంగా స్వామివారి తరఫున సిబ్బంది బుధవారం చీర, సారె సమర్పించారు. ఉదయం 8 గంటలకు సత్యదేవుని ఆలయం నుంచి దేవస్థానం వేద పండితులు, అర్చకులు, సిబ్బంది మేళతాళాలతో ఊరేగింపుగా సారె తీసుకుని మెట్ల దారిన కనకదుర్గమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి సారె సమర్పించారు.

రేపు గవర్నర్‌ రాక

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఆయన పర్యటన వివరాలనను కలెక్టర్‌ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు విజయవాడ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌కు ఉదయం 10.45 గంటలకు చేరుకుంటారు. స్వల్ప విరామం అనంతరం, 11 గంటలకు ఆదికవి నన్నయ యూనివర్సిటీకి చేరుకుని, మధ్యాహ్నం 12.05 గంటల వరకూ నిర్వహించే 16, 17వ సంయుక్త స్నాతకోత్సవంలో చాన్సలర్‌ హోదాలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అతిథి గృహంలో స్వల్ప విరామం అనంతరం, ఒంటిగంటకు హెలికాప్టర్‌లో తిరిగి విజయవాడ బయలుదేరుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement