మహిళల రక్షణలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

మహిళల రక్షణలో ప్రభుత్వం విఫలం

Jun 11 2025 12:08 PM | Updated on Jun 11 2025 12:27 PM

Former MP Chinta Anuradha

మాజీ ఎంపీ చింతా అనురాధ

ఏడాది కాలంలో 188 అమానుష ఘటనలు

అల్లవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు మహిళల రక్షణ విషయంలో పూర్తిగా విఫలమైందని, ఏడాది కాలంలో ఆడబిడ్డలపై 188 దారుణాలు చోటు చేసుకున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చర్యలు తీసుకోకపోవడం దారుణమని మాజీ ఎంపీ చింతా అనురాధ మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు కూటమి నాయకులు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. పాలనపై కన్నా రెడ్‌బుక్‌ రాజ్యంగంపై శ్రద్ధ చూపుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించి జైల్లో పెడుతూ రెడ్‌ బుక్‌ని ఫాలోఅవుతున్నారని ఎద్దేవా చేశారు. 

అనంతపురంలో తన్మయి హత్యకు గురి కాగా, పశ్చిమగోదావరి జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అధికార పార్టీకి చెందిన వ్యక్తి అత్యాచారం చేస్తే కనీసం పరామర్శించడానికి తీరిక లేదన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టడానికే కూటమి నాయకులు, హోంమంత్రి అత్యుత్సాహం చూపుతున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల పట్ల జరుగుతున్న ఆరాచకాలను ఆపి, బాధితులకు అండగా నిలబడాలని, వారి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్‌ సీపీ నాయకత్వంలో పోరాటాలను ఉధృతం చేస్తామని మాజీ ఎంపీ అనురాధ హెచ్చరించారు.

పత్రికా కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదం

సాక్షి కార్యాలయాలపై దాడులకు ఏపీ యూడబ్ల్యూజే జిల్లా శాఖ అధ్యక్షుడు బాబీ ఖండన

అమలాపురం టౌన్‌: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాక్షి పత్రికా కార్యాలయాలపై అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా శాఖ అధ్యక్షుడు మండేల బాబి ఖండించారు. ఈ మేరకు బాబి అమలాపురంలో మీడియాతో మాట్లాడారు. పత్రికా కార్యాలయాలపై దాడులు చేసే సంస్కృతి పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. సాక్షి కార్యాలయాలపై దాడులు చేసి బోర్డులపై సాక్షి అక్షరాలను తొలగించడం, పత్రికా ప్రతులను దగ్ధం చేయడం వంటి చర్యలకు పాల్పడడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. టీవీలో డిబేట్‌పై పలుచోట్ల పోలీసు కేసులు నమోదయ్యాయని, వాటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై దాడులకు పూనుకోవడం మంచి పద్ధతి కాదని బాబి అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement