ఇంట్లో పుర్రె కలకలం 

Young Man Arrested in Skull Caught in House Visakhapatnam - Sakshi

ఏఎంసీ అనాటమీ నుంచి తీసుకువచ్చి  పుర్రెకు పూజలు 

నిందితుడితో పాటు ఇంట్లో బాలిక 

పాతపోస్టాఫీసు (విశాఖ):  స్థానిక పాతనగరం రెల్లివీధిలోని ఓ ఇంట్లో ఆదివారం ఉదయం ఓ పుర్రె ప్రత్యక్షమై స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. స్థానికులు, వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దిగువరెల్లివీధి రాంనాథ్‌ హోటల్‌కు పక్క  సందులో   రెండు గదుల రేకుల ఇంట్లో రావులపూడి రాజు (20) అనే యువకుడు ఒంటరిగా నివసిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తండ్రి రావులపూడి శ్యాం (50) అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి చెడు వ్యసనాలకు లోనై   చిల్లరదొంగతనాలకు పాల్పడడంతో పాటు గంజాయి, మత్తుమందులకు అలవాటుపడి ఇష్టానుసారం ప్రవర్తించడం మొదలుపెట్టాడు. పదో తరగతి వరకు చదివి మధ్యలోనే ఆపేసిన కొడుకు ప్రవర్తన నచ్చకపోవడంతో తల్లి రావులపూడి యలమాజి (48) పీఎంపాలెం, వాంబేకాలనీకి వెళ్లిపోయి అక్కడ నివసిస్తోంది. రాజు అక్క కరుణకు వివాహం కావడంతో భర్తతో నగర శివార్లలో ఉంటోంది.   కుటుంబ సభ్యులు లేకపోవడంతో విచ్చలవిడితనానికి అలవాటు పడ్డ రాజు మత్తుమందుకు బానిసగా మారాడు. అతడి ప్రవర్తనకు సంబంధించి పలు స్టేషన్లలో కేసులు నమోదైనట్టు సమాచారం. రాజు ఆదివారం ఉదయం ప్లాస్టిక్‌ కవర్లో చుట్టిన పుర్రెను తాను నివాసం ఉంటున్న ఇంటి సందులో ఉంచాడు. (సైకో యువకుడు: మనిషి పుర్రెను..)

నిందితుడ్ని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
సందును ఆనుకుని ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఉదయం 8.30   ప్రాంతంలో సందులో ఉన్న ప్లాస్టిక్‌ కవర్‌ నుంచి దుర్వాసన రావడంతో ఇంటి నుంచి వెలుపలికి వచ్చి  కవర్‌ను కదలించడంతో అందులో నుంచి పుర్రె వెలుపలికి వచ్చింది. దీంతో పెద్దగా కేకలు వేయడంతో రాజు వచ్చి పుర్రెతో సహా ప్లాస్టిక్‌ కవర్‌ను ఇంట్లోకి తీసుకువెళ్లిపోయాడు. స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయానికి అదే ఇంట్లో ఉన్న ఓ బాలిక (మైనర్‌)ను  పోలీసులు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. మరికొద్ది సేపటిలో ఇంటికి చేరుకున్న రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.  

ఆంధ్ర వైద్య కళాశాల అనాటమీ విభాగంలో వైద్య విద్యార్థులు పరిశోధనలు జరిపిన ఓ వ్యక్తి పుర్రెగా పోలీసులు గుర్తించారు. అనాటమీ విభాగం వద్ద పరిశోధనలు పూర్తయిన శరీరాలను వేసే ప్రదేశం నుంచి దాన్ని తీసుకువచ్చినట్టు తెలుసుకున్నారు. పుర్రె ను 14 రో జుల క్రిత మే  రాజు  తీసుకువ చ్చి ఇంట్లో ఉంచి పూ జలు చేస్తున్నాడు. తనకు శివుడు అత్యంత ప్రీతపాత్రమైన దేవుడని, పుర్రెను పూజిస్తే మంచి జరుగుతుందని ఎవరో చెప్పడంతో ఈ విధంగా చేస్తున్నానని, పుర్రెను కాల్చుకు తినలేదని రాజు పోలీసుల విచారణలో తెలిపాడు. రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు పుర్రెను స్వాధీనం చేసుకుని, బాలికను విడిచిపెట్టారు. వన్‌టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని, ఎస్‌ఐ శ్రీనివాస్‌ బృందం దర్యాప్తు చేపట్టింది. నిందితుడిని సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచుతామని ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top