
సంక్రాంతి పండుగ ఆనందాల్లో పలుచోట్ల విషాదం తాండవించింది. ద్విచక్ర వాహనాలపై కుటుంబాలతో కలిసి వెళ్తున్న వారిని విధి కాటేసింది. బెంగళూరు రూరల్, మండ్య, కొళ్లేగాల ప్రాంతాల్లో సంభవించిన ఘోర ప్రమాదాల్లో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. ఫలితంగా వేడుకల స్థానంలో రోదనలు మిన్నంటాయి.
మండ్య: కారు, బైకు ఢీకొన్న ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని మద్దూరు తాలూకాలోని ఉప్పినకెరె గేటె వద్ద జరిగింది. మైసూరు జిల్లాలోని టి. నరిసిపుర తాలూకాలోని హిరియూరుకు చెందిన దర్శన్ (28), భార్య జ్యోతి (23) మృతులు. వివరాలు.. జ్యోతి స్వస్థలం తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకాలోని కొడవత్తి. సుమారు రెండేళ్ల కిందట దర్శన్‌తో పెళ్లయింది.
భార్యాభర్తలు బెంగళూరులో కెంగేరిలో ఒక హార్డ్‌వేర్ షాపులో పనిచేస్తున్నారు. బెంగళూరు నుంచి దర్శన్ సొంతూరికి బైక్‌పై బయల్దేరారు. ఉప్పినకెరె గేట్ వద్ద వేగంగా వచ్చిన కారు– బైక్ ఢీకొన్నాయి. ఇద్దరూ తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించగా పెద్దసంఖ్యలో బంధువులు వచ్చి ఎంతఘోరం జరిగిందని విలపించారు. మద్దూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం కూడా ధ్వంసమైనా డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. ప్రమాదంతో గంటకుపైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.