
సాక్షి, టెక్కలి రూరల్: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చిన్ననారాయణపురంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు ఆదివారం రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఫ్లెక్సీలు పెట్టబోతున్నామని.. అప్పటికే ఉన్న వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలంటూ స్థానిక టీడీపీ నాయకులు గొడవకు దిగారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పట్టించుకోకపోవడంతో.. ఆ ఫ్లెక్సీల ముందు అడ్డంగా టీడీపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
అదే సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇప్పిలి సంతోష్ తన కల్లంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా టీడీపీ వర్గీయులు అడ్డుకొని.. రాళ్లతో దాడి చేశారు. ఫ్లెక్సీలను చించివేశారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఇప్పిలి దేవేంద్రరావు, మన్యాల కిషోర్, ఇప్పిలి సంతోష్, ఇప్పిలి కృష్ణ, ఇప్పిలి శంకరరావు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న టెక్కలి ఎస్‌ఐ ఎన్.కామేశ్వరరావు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఇప్పిలి దేవేంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి ఎస్‌ఐ–2 గోపాల్‌రావు టీడీపీకి చెందిన 12 మందిపై కేసు నమోదు చేశారు. (చదవండి: రోడ్డు ప్రమాదం: వైఎస్సార్‌సీపీ నేత మృతి)