డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త దారుణ హత్య | Punjab Anti Drug Activist Shot Dead | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త దారుణ హత్య

Oct 13 2026 1:04 PM | Updated on Oct 13 2026 1:13 PM

Punjab Anti Drug Activist Shot Dead

మాన్సా: పంజాబ్‌లోని మాన్సా ప్రాంతంలో డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రముఖ కార్యకర్త పర్విందర్ సింగ్ ఝోటా మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. ‘ఫోర్స్’ అనే సంస్థ ద్వారా యువతను మత్తు పదార్థాలకు దూరం చేసేందుకు, మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలను అడ్డుకునేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిషేధిత ఔషధాలు, డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో ఓ మెడికల్ స్టోర్ యజమానితో ఆయనకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వివాదం ముదరడంతో సదరు కెమిస్ట్ షాపు యజమాని అతి సమీపం నుంచి పర్విందర్ సింగ్‌పై తుపాకీతో కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డయి బయటకు వచ్చాయి. ఆ వీడియోలో పర్విందర్ సింగ్ సదరు షాపు యజమానితో ‘నన్ను చంపు, చంపు.. చేతిలో పిస్టల్ ఎందుకు పెట్టుకున్నావు?’ అని సవాలు విసురుతుండగా, నిందితుడు కాల్పులు జరపడం కనిపించింది. పర్విందర్ సింగ్ చాలాకాలంగా ఈ ప్రాంతంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా చైతన్యం తేవడమే కాకుండా, పలు గ్రామ పంచాయతీల చేత డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా తీర్మానాలు కూడా చేయించారు. ఈ క్రమంలో ఆయన డ్రగ్ వ్యాపారులతో నేరుగా తలపడటంతో గతంలోనూ పలుమార్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

పర్విందర్ సింగ్ హత్యతో మాన్సా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ హత్యను నిరసిస్తూ ప్రజలు, స్థానికులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలన్నింటినీ మూసివేశారు. మరోవైపు, ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. బీజేపీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఈ హత్యను తీవ్రంగా ఖండించాయి. బీజేపీ నేత పర్మిందర్ సింగ్ బ్రార్ స్పందిస్తూ.. పంజాబ్ యువత కోసం పోరాడుతున్న వ్యక్తికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వం డ్రగ్ స్మగ్లర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి రాష్ట్రాన్ని అరాచకంలోకి నెట్టివేసిందని శిరోమణి అకాలీదళ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

ఇదీ చదవండి: థీమ్ పార్క్‌లో ప్రమాదం.. రోలర్ కోస్టర్ రైడ్‌లో ఒకరు మృతి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement