
సాక్షి,బెంగళూరు: ప్రేమన్నాడు. పెళ్లన్నాడు. నువ్వులేకపోతే నేను లేనన్నాడు. కాదూ కూడదు అంటే చచ్చిపోతున్నాడు. చివరికి ఆమెను లేకుండా చేశాడు. గర్భవతిగా ఉన్న భార్యను కడతేర్చాడు. ఆపై పరారయ్యాడు.
బెంగళూరు పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరులో జరిగిన విషాద ఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు శివం తన 22 ఏళ్ల గర్భవతి భార్య సుమనను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
శివం, సుమన ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో మందలించారు. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి ఐదు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అనంతరం, బెంగళూరుకు పారిపోయి వచ్చారు. బెంగళూరులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న శివమ్ పెయింటర్‌గా పనిచేస్తుండగా.. సుమన ఇంట్లోనే ఉంటుంది. ఆమె మూడు నెలల గర్భిణీ.
ఐదేళ్ల పాటు ప్రేమ,దోమ అంటూ సుమన వెంటబడ్డ శివమ్ పెళ్లి తర్వాత తన రాక్షస బుద్ధిని బయటపెట్టాడు. అనుమానం పేరుతో సుమనను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇదే విషయమై సుమనపై శివమ్ చేయిచేసుకున్నాడు. ఇరువురి మధ్య గొడవ జరగడంతో ఎవరికి వారు వేర్వేరు రూముల్లోకి వెళ్లి నిద్రించాడు. మరునాడు అంటే మంగళవారం ఆమెను నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. ఆమె స్పందించకపోవడంతో ఎప్పటిలాగే పనికెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు. పూటగా మద్యం సేవించాడు. బుధవారం సైతం ఆమెను లేపేందుకు ప్రయత్నించగా అచేతనంగా పడి ఉండి.
సుమన మరణించిందని నిర్ధారించుకొని ఇంటినుంచి పారిపోయాడు. అయితే,ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సుమన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. వివాహం జరిగిన నాటి నుంచి సుమనపై అనుమానం పెంచుకున్న భర్త శివమ్ ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించారు.