నా ముల్లంగి పంటే మీకు లంచం
తుమకూరు: పొలానికి దారి చూపాలని దరఖాస్తు చేసుకున్న రైతు, లంచం ఇవ్వలేదని రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో తాను పండించిన ముల్లంగి పంటను ఇవ్వడానికి వచ్చాడు. రైతుల దురవస్థకు అద్దం పట్టే ఈ సంఘటన తుమకూరు జిల్లా మధుగిరి తాలూకాఫీసులో జరిగింది. జక్కెనహళ్లి కి చెందిన రైతు ప్రసన్నకుమార్ గురువారం ముల్లంగిలను తీసుకువచ్చి మైక్ పట్టుకుని హల్‌చల్ చేశాడు. ‘లంచం ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు, బదులుగా, నేను పండించిన ముల్లంగిని ఇస్తాను, రండి, రండి‘ అని గొంతెత్తడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఏమిటీ కేసు...
రైతు పొలానికి దారి లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు. లోకాయుక్త కోర్టును ఆశ్రయించగా, నెలలోపు దారి చూపాలని కోర్టు ఆదేశించింది. ఈ పనులు చేయాలంటే తమకు లంచం ఇవ్వాలని కొందరు అధికారులు ఆ రైతును ఒత్తిడి చేశారు. తన వద్ద డబ్బు లేదని, తాను పండించిన ముల్లంగిని నాకు ఇస్తానని హంగామా చేశాడు. వారంలోపు సమస్య పరిష్కారం కాకపోతే, తహశీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకుంటాను అని కేకలు వేశాడు.
దారి చూపుతాం
దీనిపై రెవెన్యూ అధికారి గోలూరు శివప్ప మాట్లాడుతూ మా అధికారులు తప్పు చేస్తే చర్యలు తీసుకుంటాము. అన్నీ సరిగా ఉంటే వారంలోపు దారి చూపుతాం, రైతు ఈ దేశానికి ఆస్తి, అతను చనిపోవడం గురించి మాట్లాడకూడదు అని అన్నారు.
మధుగిరి తాలూకాఫీసులో రైతు ఆవేదన
పొలానికి దారి చూపాలని వేడుకోలు


