యాక్సిడెంట్లతో పెను ముప్పు
బనశంకరి: బెంగళూరుతో పాటు రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాల సంచారం పెరిగిపోవడంతో, కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో డ్రగ్స్‌పై జాగృతం చేయనున్నట్లు హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. గురువారం రవాణా, పోలీస్‌శాఖలు ప్యాలెస్ మైదానంలో నిర్వహించిన జాతీయ రోడ్డు సురక్షతా మాసం ముగింపు కార్యక్రమంలో రవాణా మంత్రి రామలింగారెడ్డి, పరమేశ్వర్ పాల్గొన్నారు. దేశంలో 4.70 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే, కర్ణాటకలో 43 వేల ప్రమాదాలు జరిగాయని, వేలాది మంది చనితున్నారని చెప్పారు. మైసూరు–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేని ప్రారంభించిన రెండు నెలలకే అక్కడ 120 మంది మృత్యువాతపడటం విచారకరమన్నారు. అధికారులు చాలా బ్లాక్‌స్పాట్‌లను సరిదిద్దారన్నారు. బెంగళూరులోనూ యాక్సిడెంట్లకు వేలాది మంది బలవుతున్నారు, కుటుంబ పోషకుడు మరణిస్తే వారి గతి ఏం కావాలని ప్రశ్నించారు. బెంగళూరు నగరంలో 500 జంక్షన్లలో 10 వేలకు పైగా ఏఐతో పనిచేసే కెమెరాలను అమర్చామని, కమాండ్ సెంటర్ నుంచి ఏ జంక్షన్‌లో ఏమి జరుగుతుంది అనేది తనిఖీ చేయవచ్చని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడేవారికి జరిమానా వేయడంతో ఉల్లంఘనలు తగ్గాయన్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని ఆర్టీసీ బస్సుల్లో మత్తు పదార్థాల ముప్పుపై జాగృతం చేయాలని పరమేశ్వర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దినేశ్‌గుండూరావ్, డీజీపీ ఎంఏ. సలీం, కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాక్సిడెంట్లకు గురైన వాహనాలను పరిశీలించారు.
హోంమంత్రి పరమేశ్వర్
ఆర్టీసీ బస్సుల్లో డ్రగ్స్‌పై జాగృతి


