యాప్స్‌ కేసులో నాగరాజే కీలకం! | Police Suspect That Nagraj Is A key Culprit In The Loan Apps Case | Sakshi
Sakshi News home page

యాప్స్‌ కేసులో నాగరాజే కీలకం!

Jan 1 2021 11:16 AM | Updated on Jan 1 2021 11:30 AM

Police Suspect That Nagraj Is A key Culprit In The Loan Apps Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ మైక్రోఫైనాన్సింగ్‌కు సంబంధించిన లోన్‌ యాప్స్‌ కేసుల్లో నాగరాజే కీలక నిందితుడని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఢిల్లీలో అరెస్టు చేసి తీసుకువచ్చిన చైనీయుడు ల్యాంబో మాత్రం నోరు విప్పట్లేదు. ఆ యాప్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వీరిద్దరినీ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించిన దర్యాప్తు అధికారులు ఆ మేరకు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. ఏపీలోని కర్నూలుకు చెందిన నాగరాజు హైదరాబాద్‌ కంపెనీల హెడ్‌ మధుబాబు ద్వారా చైనీయులకు పరిచయమయ్యాడు. దీంతో చైనీయులు బెంగళూరు, ఢిల్లీ కార్యాలయాలకు నాగరాజును ఇన్‌చార్జిగా నియమించారు. లోన్‌ యాప్స్‌తో పాటు కాల్‌ సెంటర్లు నిర్వహించడానికి నాలుగు కంపెనీలు ఏర్పాటు చేసిన చైనా మహిళ జెన్నిఫర్‌ వాటిలోని ఉద్యోగులనే డైరెక్టర్లుగా నియమించింది. ఇలా నియుక్తులైన నలుగురు డైరెక్టర్లు కలిసి నాగరాజుకు కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో నాగరాజు ఢిల్లీలో పది కరెంట్‌ బ్యాంకు ఖాతాలు తెరిచాడు. వీటి ఆధారంగా రెండు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలతో (ఎన్‌బీఎఫ్‌సీ) ఒప్పందాలు చేసుకున్నాడు. (లోన్‌యాప్స్‌ కేసులో ఆసక్తికర విషయాలు)

ఇలా లోన్‌ యాప్స్‌ కార్యకలాపాలను జోరుగా సాగించాడు. మరోపక్క మధుబాబు పర్యవేక్షిస్తున్న హైదరాబాద్‌ కాల్‌ సెంటర్లకు మొత్తం డేటాను జెన్నీఫర్‌ చైనా నుంచే పంపేది. ఈ డేటా ఆధారంగా మధుబాబు డిఫాల్టర్ల వివరాలు తెలుసుకునే వాడు. వీటినే టెలీకాలర్లకు షేర్‌ చేసి ఫోన్లు చేయిస్తుండేవాడు. కాగా, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరుల్లో ఉన్న కాల్‌ సెంటర్లలో ఉద్యోగులకు చైనీయులు నేరుగా జీతాలు చెల్లించకుండా.. హైదరాబాద్‌కు సంబంధించి ఫోకస్, ఢిల్లీలో మెరీడియన్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. వీటి ద్వారానే సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలను సంప్రదించి ఉద్యోగులు, కాల్‌ సెంటర్ల పూర్తి జాబితాలను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. బుధవారం చైనా పారిపోయే ప్రయత్నాల్లో ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులకు చిక్కిన ల్యాంబో తనకేమీ తెలియదని బుకాయిస్తున్నాడు. తనకు ఆ యాప్స్‌తో ఎలాంటి సంబంధాలు లేవని, స్వదేశానికి వెళ్లిపోతుంటే అన్యాయంగా అరెస్టు చేశారని అంటున్నాడు. ప్రస్తుతం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కస్టడీలో ఉన్న ఢిల్లీ కాల్‌ సెంటర్‌ ఉద్యోగులు మాత్రం ల్యాంబోను గుర్తించారు. అతడే తమకు డేటా ఇచ్చేవాడని తెలిపారు. (లోన్‌ యాప్స్‌ కేసు: చైనా ల్యాంబో చిక్కాడు! )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement