లోన్‌యాప్స్‌ కేసులో ఆసక్తికర విషయాలు

Cyberabad Police Speed up The Instant Loan Apps Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇన్‌స్టంట్ లోన్యాప్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు. బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్‌లో తనిఖీలు నిర్వహించి ఇన్‌స్టంట్‌ రుణాల పేరుతో పెనాల్టీగా అధిక మొత్తం వసూలు చేస్తూ  వేధింపులకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. అప్పు ఇచ్చిన సంస్థ వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సునీల్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు ఆరుగురు ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ కాల్‌సెంటర్‌ నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు. సునీల్ కాల్‌డేటా ఆధారంగా వీరిని గుర్తించారు. ఇప్పటికే పలు ఆన్‌లైన్ యాప్‌ ‌ టెలీ కాలర్‌లందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. (యాప్‌ రుణానికి  మరొకరు బలి )

హైదరాబాద్‌లో నిన్న (సోమవారం​ )3చోట్ల నిర్వహించిన దాడుల్లో 650 మంది ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. వీరందరిపై 41 సీఆర్‌పీసీ కింద సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మద్యాహ్నం మూడు గంటలకు అడిషనల్ సిపి క్రైమ్స్ షికా గోయల్ ప్రెస్ మీట్ నిర్వహించి నిందితులను మీడియా ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ ఆన్‌లైన్‌ యాప్స్‌ నిర్వహణలో ఆసక్తికర అంశాలను గుర్తించారు. కాల్‌సెంటర్‌ బయట ఉద్యోగులు కస్టమర్లతో పాటించాల్సిన నియమాలంటూ ఓ నోట్‌ ఉంచారు. ఇందులో కస్టమర్లను గౌరవించాలి, వారితో మర్యాదగా మాట్లాడాలని రాసి ఉంది. కానీ అందుకు పూర్తి విరుద్దంగా లోపల దందా జరుగుతుంది. అప్పు తీసుకున్న కస్టమర్లు గడువులోగా చెల్లించకపోతే కస్టమర్లను బూతుపురాణం తిడుతూ వడ్డీ వసూలు చేస్తున్నారు. ఎంత వసూలు చేస్తే కాల్ సెంటర్ ఉద్యోగులకు అంత ఇన్సెంటివ్లు ఇస్తుండటంతో ఉద్యోగులు కస్టమర్లను వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఇప్పటికే పలువురు బాధితులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.  (లోన్‌యాప్‌: తల్లి ఫొటోలు మార్ఫింగ్‌ )


Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top