యాప్‌ రుణానికి  మరొకరు బలి

Software Engineer Commits Suicide For Not Pay Loan - Sakshi

వడ్డీలు చెల్లించలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

రాజేంద్రనగర్ ‌: అప్పు ఇచ్చిన సంస్థ వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌ యాప్‌ల నుంచి రూ.50 వేల రుణం తీసుకుని, అధికవడ్డీలు చెల్లించలేక మనోవేదనతో తనువు చాలించాడు. గుంటూరు మంగళ గిరికి చెందిన సునీల్‌(29) హైదరాబాద్‌ నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య, ఆరునెలల కూతురుతో కలిసి రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌లో నివసిస్తున్నాడు.

కరోనాతో ఉద్యోగం పోవడంతో.. 
కరోనా పరిణామాల నేపథ్యంలో సునీల్‌ ఉద్యోగం పోయింది. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురైన అతడు పలు ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా మొత్తం రూ.50 వేలు అప్పు చేశాడు. 30 శాతం వడ్డీతో డబ్బులు చెల్లించాలని యాప్‌ల నిర్వాహకులు ఇటీవల అతడిపై తీవ్ర ఒత్తిడి చేశారు. వీటితో పాటు సునీల్‌కు వ్యక్తిగతంగా మరో రూ.6 లక్షల అప్పు ఉంది. మూడు నెలల క్రితం స్వగ్రామంలో ఉన్న భూమిని విక్రయించి తల్లిదండ్రులు ఆ అప్పు చెల్లించారు. అనంతరం తండ్రి వెంకటరమణ సునీల్‌కి మరో రూ.లక్ష కూడా ఇచ్చాడు. అయితే, ఆన్‌లైన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తీవ్రమవడంతో పది రోజులక్రితం సునీల్‌ సైబర్‌ క్రైంకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్వయంగా ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించగా సునీల్‌ వెళ్లలేదు. ఇదిలా ఉండగా, అతడికి మూడు రోజులక్రితం బంజారాహిల్స్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో రూ.7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. బుధవారం మధ్యాహ్నం కంపెనీ నిర్వాహకులు కాల్‌ చేయగా, ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. ఉద్యోగం మరొకరికి ఇవ్వండి’అని చెప్పి కాల్‌ కట్‌ చేసి ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశాడు. 

సునీల్‌ డిఫాల్టర్‌ అంటూ బంధువులకు మెసేజ్‌లు  
ఆన్‌లైన్‌లో అప్పులు ఇచ్చిన యాప్‌ల నిర్వాహకులు సునీల్‌ ఫోన్‌ డేటాను హ్యాక్‌ చేసి, అతడి స్నేహితులు, బంధువులకు ‘సునీల్‌ డిఫాల్టర్‌’అని అతడి ఫొటోతో మెసేజ్‌లు పంపారు. దీంతో సునీల్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. బుధవారం రాత్రి భోజ నం చేసేందుకు రమ్మని సునీల్‌ భార్య తలుపు తట్టగా స్పందన లేకపోవడంతో, కిటికీ లోంచి చూడగా అతడు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top