లోన్‌ యాప్స్‌ కేసు: చైనా ల్యాంబో చిక్కాడు!

Loan Apps Case: HYD Police Arrested Two Accused - Sakshi

లోన్‌ యాప్స్‌ కేసుల్లో కీలక నిందితుడు  

కొన్ని రోజులుగా అజ్ఞాతంలో 

చైనా పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు 

బెంగళూరులో చిక్కిన మరో నిందితుడు నాగరాజు  

4 కంపెనీల లావాదేవీలే రూ. 21 వేల కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ మైక్రోఫైనాన్సింగ్‌కు సంబంధించిన లోన్‌ యాప్స్‌ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన చైనీయుడు ల్యాంబో ఎట్టకేలకు ఢిల్లీలో పోలీసులకు చిక్కాడు. బెంగళూరులో రెండు కాల్‌ సెంటర్లకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న నాగరాజును సైతం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ యాప్‌లకు సంబంధించి మొత్తం ఆరు కంపెనీలపై పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఇప్పటి వరకు నాలుగు కంపెనీల లావాదేవీల వివరాలు సేకరించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. వాటి టర్నోవర్‌ రూ.21 వేల కోట్లుగా ఉన్నట్లు తేల్చారు.

ఈ యాప్స్‌ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన చైనాకు చెందిన క్యూ యోన్‌ అనే మహిళ, యాప్‌లతో పాటు కాల్‌సెంటర్ల ఏర్పాటు వ్యవహారాలను కూడా పర్యవేక్షించినట్లు వెల్లడైంది. కాగా ఈమె ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి చైనా వెళ్ళిపోతూ తమ దేశీయుడే అయిన ల్యాంబోను ఇన్‌చార్జిగా నియమించింది. ఇతను హైదరాబాద్, గుర్గావ్, బెంగళూరుల్లో ఏర్పాటైన లియోఫాగ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, హాట్‌ఫుల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, పిన్‌ప్రింట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, నబ్లూల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఎన్యూ ప్రైవేట్‌ లిమిటెడ్, ట్రూత్‌ ఐ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలకు ఇన్‌చార్జిగా ఉన్నాడు.

వీటి అదీనంలోని దాదాపు 34 యాప్స్‌తో పాటు కాల్‌ సెంటర్ల వ్యవహారాలు పర్యవేక్షించాడు. చైనా నుంచి అందే ఆదేశాల ప్రకారం ఇతను నడుచుకున్నట్లు తెలిసింది. కేవలం నిబంధనల కారణంగానే చైనీయులు తమ సంస్థల్లో భారతీయులను డైరెక్టర్లుగా నియమించుకుంటున్నారు. అయితే నిర్ణయాధికారం, సంతకం చేసే అధికారం, చెక్‌ పవర్‌ ఉన్న పోస్టుల్లో మాత్రం తమ జాతీయులను నియమించుకుంటున్నారు. అలాంటి వారిలో ల్యాంబో అత్యంత కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

పాస్‌పోర్ట్‌ కాపీ ఆధారంగా గుర్తింపు 
ఇటీవల లోన్‌ బాధితులు ఆత్మహత్యలు చేసుకోవడం, కేసులు నమోదవుతుండటం.. తదితర పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో ఉండే ఇతను కొద్ది రోజుల కిందట అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అయితే గుర్గావ్‌లోని కాల్‌ సెంటర్లలో సోదాలు చేసిన సందర్భంలో పోలీసులకు ల్యాంబో పాస్‌పోర్ట్‌ కాపీ దొరికింది. ల్యాంబో అదను చూసుకుని దేశం దాటే అవకాశం ఉందని భావించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. పాస్‌పోర్ట్‌ కాపీ ఆధారంగా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ చేశారు. కాగా, బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి చైనాలోని షాంఘై పారిపోవడానికి ల్యాంబో ప్రయత్నించాడు.

అయితే ఎల్‌ఓసీ ఆధారంగా ఇతడిని గుర్తించిన ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం ల్యాంబోను అరెస్టు చేసి తీసుకువస్తోంది. ఇదిలా ఉండగా హైదరాబాద్‌ కాల్‌ సెంటర్లకు సంబంధించి కీలకంగా ఉన్న మధుబాబు తన స్నేహితుడు నాగరాజును బెంగళూరులోని రెండు కాల్‌ సెంటర్లకు ఇన్‌చార్జిగా నియమించాడు. బుధవారం ఇతడిని కూడా బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఆరు కంపెనీల్లో .. నాలుగింటి లావాదేవీలు బుధవారం దర్యాప్తు అధికారులకు అందాయి.

వీటి పేమెంట్‌ గేట్‌ వేస్‌ నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన అధికారులు, ఈ ఏడాది జూన్‌ నుంచి నవంబర్‌ వరకు 1.4 కోట్ల లావాదేవీలకు సంబంధించి రూ.21 వేల కోట్ల టర్నోవర్‌ జరిగినట్లు తేల్చారు. ఈ మొత్తం ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడకు వెళ్ళింది? తదితర విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బిట్‌కాయిన్స్‌ రూపంలో ఏమైనా దేశం దాటించారా అన్న అంశాన్నికూడా పరిశీలిస్తున్నారు. ల్యాంబో, నాగరాజులను హైదరాబాద్‌కు తీసుకువచ్చి ప్రశ్నించనున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top