
సాక్షి,హైదరాబాద్: మాదన్న పేట బాలిక హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఏడేళ్ల బాలిక అల్లరి చేస్తుందనే కారణంతో మేనమామ,అత్త కిరాతకంగా ప్రాణాలు తీసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో అల్లరి చేస్తుందన్న కారణంతో బాలికను నోటికి ప్లాస్టర్ వేసి, కాళ్లు చేతులు కట్టేసి వాటర్ ట్యాంక్‌లో పడేశారు. అయితే, బాలిక తల్లితో నిందితులకు గత కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓ వైపు ఆస్తి పంపకాల విషయంలో గొడవలు, పాప అల్లరి చేయడం తట్టుకోలేక విచక్షణ కోల్పోయిన నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
పోలీసుల వివరాల మేరకు.. ఒవైసీ కంచన్ బాగ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక గత వారం తన తల్లితో కలిసి మాదన్నపేటలో నివసించే అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో మొన్న సాయంత్రం ఇంట్లో నుండి బయటకి వెళ్లిన బాలిక ఆచూకీ గల్లంతయ్యింది. చీకటి పడుతున్న పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాలిక తల్లి, అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. బాలిక మృతదేహం నీళ్ల ట్యాంక్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రమాదవ శాత్తూ బాలిక నీళ్ల ట్యాంకులో పడిపోయిందా.. లేదంటే ఎవరైనా హత్య చేసి అందులో పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి వాటర్ ట్యాంక్‌లో నీర్జీవంగా ఉన్న బాలిక మెడ, నోరు, చేతులు అనుమానాస్పద గుర్తులు ఉండటం, చేతులు వెనక్కి విరిచి ఉండడంపై పోలీసులు బాలికది హత్యేనని ప్రాథమిక దర్యాప్తులో విచారణలో నిర్ధారించారు. కుటుంబ సభ్యుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు.
ఈ విచారణలో బాలిక మేనమామ,అతని భార్య తీరు అనుమానాస్పదంగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టగా దారుణం వెలుగులోకి వచ్చింది. బాలికను హత్య చేసింది మేనమామ,అత్తేనని గుర్తించారు.