గోల్కొండ: విడాకులు తీసుకున్న ఓ జంట మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవడానికి పథకం వేసిన ఆ జంట బాలిక కిడ్నాప్‌కు పథకం వేశారు. ఈ వివరాలను సౌత్ వెస్ట్ జోన్ అదనపు డీసీపీ కృష్ణగౌడ్ ఆదివారం గోల్కొండలోని టోలిచౌకీ ఏసీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం...
హకీంపేట్‌కు చెందిన మహ్మద్ ఫయాజ్ (25) గోల్కొండకు చెందిన సల్మాబేగం అలియాస్ సమ్రీన్ (24) ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే అతి కొద్ది కాలంలోనే విడాకులు తీసుకున్నారు. ఆటో డ్రైవర్ అయిన ఫయాజ్ హకీంపేట్‌లో ఉంటూ మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండేళ్లుగా ఫయాజ్ తన మొదటి భార్య సల్మా బేగంను తరచూ కలుసుకుంటున్నాడు. కొద్దికాలం క్రితం ఇద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఈ పెళ్లికి ఫయాజ్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.
అయితే తనకు విడాకుల సమయంలో సల్మాబేగం గర్భవతి అని విడాకుల అనంతరం ఆమెకు ఆడపిల్ల పుట్టిందని ఫయాజ్ తన తల్లిదండ్రులను నమ్మించి పెళ్లికి ఒప్పుకోవాలని ఒత్తిడి చేశాడు. అనంతరం పాపను కిడ్నాప్ చేయాలని పథకం వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం సల్మాబేగం గోల్కొండ సాలేనగర్‌లోని ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న సఫియాబేగం అనే నాలుగేళ్ల చిన్నారిని మాయమాటలు చెప్పి ఎత్తుకొచ్చింది. ఫయాజ్ సల్మాతో పాటు చిన్నారిని హకీంపేట్‌లోని తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ సమయంలో అతడి రెండవ భార్య పుట్టింటికి వెళ్లింది. కాగా అదే రోజు సాయంత్రం కిడ్నాప్‌కు గురైన చిన్నారి తల్లిదండ్రులు గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఆటో డ్రైవర్ అయిన ఫయాజ్ చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉండగా ఫయాజ్‌తో పాటు సల్మాబేగంలను అదుపులోకి తీసుకున్నారు. అదే ఇంట్లో ఉన్న కిడ్నాప్‌కు గురైన చిన్నారిని కూడా పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. నిందితుల నుంచి ఆటోను, రెండు మొబైల్ ఫోన్‌లను స్వా«దీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ప్రెస్ మీట్‌లో గోల్కొండ ఇన్‌స్పెక్టర్ బి.సైదులు, టోలిచౌకీ డివిజన్ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ పాల్గొన్నారు.


