ముగ్గురి హత్యలతో విషాదంగా ముగిసిన లాక్‌డౌన్ ప్రేమ.. చంటి బిడ్డతో పోలీస్‌ స్టేషన్‌కు

Lockdown Love Man Kills Wife Her Parents Goes To Cops With Baby Assam - Sakshi

కరోనా లాక్‌డౌన్‌లో చిగురించిన ప్రేమను పెళ్లితో భద్రపరుచుకున్నారు. కానీ వారి సంబరం ముణ్నాళ్ల ముచ్చటగానే మారింది. మూడేళ్ల ప్రేమ బంధం.. ముగ్గురి హత్యలతో షాదాంతంగా ముగిసింది. ట్రిపుల్‌ మర్డర్‌ అనంతరం నిందితుడు తొమ్మిది నెలల శిశువును చంకలో ఎత్తుకొని పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకు చెందిన మెకానికల్‌ ఇంజనీర్‌ అయిన నజీబుర్‌ రెహ్మాన్‌(25), 24 ఏళ్ల సంఘమిత్ర ఘోష్‌లు 2020లో ఫేస్‌బుక్‌ ద్వారా స్నేహితులయ్యారు. కొన్ని రోజుల్లోనే వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో అదే సంవత్సరం అక్టోబర్‌లో ఇద్దరూ కోల్‌కతాకు పారిపోయారు. 

తరువాత సంఘమిత్ర తల్లిదండ్రులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఆమె అప్పటికే కోల్‌కతా కోర్టులో నజీబుర్‌ను వివాహం చేసుకున్న విషయం తల్లిదండ్రులకు చెప్పింది. తర్వాతి ఏడాది సంఘమిత్ర తల్లిదండ్రులు సంజీవ్ ఘోష్, జును ఘోష్ సొంత కుమార్తెపైనే దొంగతనం కేసు పెట్టడంతో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి నెల రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. బెయిల్ రావడంతో తిరిగి ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి  చేరింది.
చదవండి: హైదరాబాద్‌లో మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు

జనవరి 2022లో సంఘమిత్ర, నజీబుర్ మళ్లీ ఇంట్లో నుంచి పరారయ్యారు. అయిదు నెలలపాటు ఇద్దరూ చెన్నైలో నివాసం ఉన్నారు. తరువాత ఆ జంట ఆగస్టులో గోలాఘాట్‌కు తిరిగి వచ్చేసరికి సంఘమిత్ర గర్భవతిగా ఉంది. వీరిద్దరూ నజీబుర్ ఇంటిలో జీవించడం ప్రారంభించారు. గత నవంబర్‌లో ఈ జంటకు ఓ కుమారుడు జన్మించాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ నాలుగు నెలల తర్వాత సంఘమిత్ర తన కొడుకుతో ఈ  ఏడాది మార్చిలో తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది.

నజీబుర్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నజీబుర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. 28 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, నజీబుర్ తన కొడుకును కలిసేందుకు ప్రయత్నించగా.. సంఘమిత్ర కుటుంబం అందుకు ఒప్పుకోలేదు.  

అనంతరంఏప్రిల్ 29న సంఘమిత్ర, ఆమె కుటుంబ సభ్యులు నజీబుర్‌పై దాడి చేశారని ఆరోపిస్తూ అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నజీబుర్ తన భార్య సంఘమిత్ర, ఆమె తల్లిదండ్రులను కొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తన తొమ్మిది నెలల కొడుకును చేతిలో ఎత్తుకొని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 

నిందితులపై హత్యా తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అస్సాం పోలీసు చీఫ్ జీపీ సింగ్ తెలిపారు. ఈ దారుణ హత్యపై రాష్ట్ర సీఐడీ బృందం విచారణ చేపట్టింది. ఫోరెన్సిక్ బృందాలను కూడా రప్పించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top