‘నారాయణ’ కళాశాలలో ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం | Sakshi
Sakshi News home page

మార్కుల కోసం కాలేజీ టార్చర్‌..

Published Wed, Nov 1 2023 5:00 AM

Inter Student Suicide in Hyderabad - Sakshi

మీర్‌పేట: ‘సారీ అమ్మానాన్న.. ఇదే నా చివరి రోజు. మార్కులు ఎక్కు వగా తెచ్చుకోవాలని కళాశాల యాజమాన్యం చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నా’ అంటూ సూసైడ్‌ లెటర్‌ రాసి ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మీర్‌పేటలోని గౌతంనగర్‌కు చెందిన పాల వ్యాపారి మంచన ఆనంద్, కృష్ణవేణి దంపతుల పెద్ద కుమారుడు వైభవ్‌ (16) చైతన్యపురిలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ (ఎంపీసీ) చదువుతున్నాడు.

అప్పుడప్పుడూ వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండే వైభవ్‌ మంగళవారం తెల్లవారుజామున పని ముగించుకొని కళాశాలకు వెళ్తానని ఇంటికి వచ్చాడు. అనంతరం బెడ్‌రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంట్లో లభించిన సూసైడ్‌ నోట్‌లో ‘మంచి మార్కులు తెచ్చుకోవాలని టీచర్లు, ప్రిన్సిపల్, వైస్‌ ప్రిన్సిపల్‌ ఒత్తిడి, టార్చర్‌ చేస్తున్నారు. సారీ అమ్మానాన్న, తమ్ముడు.. దయచేసి ఎవరూ నారాయణ కళాశాలలో చేరొద్దు.

ఇదే నా జీవితంలో చివరి రోజు. దయచేసి విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దు. నా తమ్ముడిని మంచి కళాశాలలో చేర్పించండి. అతని భవిష్యత్తు బావుండాలని కోరుకుంటున్నా. చివరగా ప్రిన్సిపాల్, వైస్‌ ప్రిన్సిపాల్‌కు క్షమాపణలు’ అని లేఖలో రాశాడు. దీంతో నారాయణ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ మృతుడి బంధువులు, స్థానికులు, ఏబీవీపీ నాయకులు పోలీస్‌స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. కళాశాల ప్రిన్సిపల్, వైస్‌ ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement