గెలుపే ప్రధానం! | - | Sakshi
Sakshi News home page

గెలుపే ప్రధానం!

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

గెలుపే ప్రధానం!

గెలుపే ప్రధానం!

మున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు

అభ్యర్థుల గెలుపు కోసం రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు, ఎంపీలు

మున్సిపల్‌ ఎన్నికల సమరంలో మూడు పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఆయా పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు.

సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపల్‌ ఎన్నికలను అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మెజార్టీ వార్డులు సహా చైర్మన్‌ పీఠాలను ఎట్టిపరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దని భావిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించి వారి మద్దతు కూడగట్టే పనిలో అధికార కాంగ్రెస్‌ నిమగ్నం కాగా, ప్రభుత్వ వైఫల్యాలను, నిలిచిపోయిన సంక్షేమ పథకాలను, జరిగిన నష్టాలను ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రచారాస్త్రాలుగా వినియోగిస్తున్నాయి. దాదాపు అన్ని వార్డుల్లోనూ ముక్కోణపు పోటీ నెలకొని ఉండడంతో ఆ మేరకు ఆయా పార్టీలు అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

మున్సిపల్‌ పీఠాలపై హస్తం గురి

అధికార కాంగ్రెస్‌ ఆరు మున్సిపల్‌ పీఠాలపై గురి పెట్టింది. 126 స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దించింది. పరిగి కేంద్రంగా ఈ నెల 7న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభను ఏర్పాటు చేసి, అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగా బుధవారం మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మొయినాబాద్‌లో సన్నాహాక సమావేశం నిర్వహించారు. బహిరంగ సభ విజయవంతం సహా అభ్యర్థుల గెలుపు కోసం అంతా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ పీఠం జనరల్‌కు రిజర్వ్‌ కాగా, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ ఎన్నికను ప్రతిషాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపిక, బీ ఫాంల జారీలోనూ ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. షాద్‌నగర్‌ మున్సిపల్‌ పీఠం బీసీకి రిజర్వ్‌ అయింది. మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని, మున్సిపల్‌ పీఠంపై కాంగ్రెస్‌ జెండాను ఎగరేసి షాద్‌నగర్‌ గడ్డపై తనకు తిరుగులేదని నిరూపించాలని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ భావిస్తున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే ఇక్కడ అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీకి కొంత నష్టం చేకూర్చిపెట్టే అవకాశం లేకపోలేదు.

చేవెళ్లలో చేతులు కలిసేనా..?

చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల, శంకర్‌పల్లి జనరల్‌ కేటగిరికి రిజర్వ్‌ కాగా, మొయినాబాద్‌ ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూడు మున్సిపల్‌ స్థానాల్లోనూ పార్టీ జెండాను ఎగరేసి తీరాలని అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్‌ఎస్‌లో గెలుపొంది, ఆ తర్వాత అధికార కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ తరపున పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన భీంభరత్‌ వర్గం ఆయన చేరికను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌ రెండు వర్గాలుగా చీలిపోయి ఉప్పు నిప్పులా చిటపటలాడుతోంది. కొన్ని వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ గందరగోళం తలెత్తింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి రంగంలోకి దిగి ఇరు వర్గాలను సముదాయించినప్పటికీ.. అంతర్గత విబేదాలు పూర్తిగా సమిసి పోలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అభ్యర్థుల గెలుపు కోసం ఇక్కడి పార్టీ కేడర్‌ చేతులు కలిపి పని చేస్తుందా? అంటే అనుమానమే.

ఆరు మున్సిపాలిటీల పరిధిలో బీఆర్‌ఎస్‌ 122 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ మంత్రి సబితారెడ్డి ప్రచారం చేస్తుండగా, ఇబ్రహీంపట్నంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై నప్పటికీ.. ఆయన పట్నం గడప దాటలేదు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి సబితారెడ్డి బుధవారం చేవెళ్లలోని ఒకటి, రెండు వార్డుల్లో ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరిగి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. బీఆర్‌ఎస్‌ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కల్వకుర్తిలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, రజనీసాయిచంద్‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తుండగా, షాద్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య ప్రచారం చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో మెజార్టీ అభ్యర్థులను గెలిపించుకుని పార్టీ పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ తరపున మొత్తం 109 మంది బరిలో నిలిచారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో ఆ పార్టీ జాతీయ నాయకుడు ఆచారి అన్నీ తానై వ్యవహరిస్తుండగా, చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ మున్సిపాలిటీల్లో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం ఆయన చేవెళ్లలోని ఐదు, ఆరు, ఏడు వార్డుల్లో ప్రచారం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత భారత్‌ లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా నిలువాల్సిన జిల్లా అధ్యక్షుడు క్షేత్రస్థాయిలో పెద్దగా కనిపించడం లేదు. దీంతో గెలుపు కోసం అభ్యర్థులే ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement