‘ఫ్యూచర్’తో గుర్తింపు
● ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంక
● వంద అడుగుల రోడ్డు నిర్మాణానికి స్థల పరిశీలన
● స్వచ్ఛందంగా భూములు ఇవ్వాలని నిర్వాసితులకు సూచన
యాచారం: ఫ్యూచర్‌సిటీ నిర్మాణంతో ప్రపంచస్థాయి గుర్తింపు తథ్యమని ఎఫ్‌సీడీఏ(ప్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ) కమిషనర్ శశాంక అన్నారు. బుధవారం ఆయన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, తక్కళ్లపల్లి సర్పంచ్ మారెడ్‌పల్లి నరేందర్‌రెడ్డి, టీజీఐఐసీ, రెవెన్యూ, రోడ్డు భవనాల శాఖల ఉన్నతాధికారుల బృందంతో కలిసి సాగర్ హైవే తక్కళ్లపల్లి గేట్ నుంచి నక్కర్తమేడిపల్లి శివారు హెచ్‌జీపీసీ (హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ) లే అవుట్ వరకు చేపట్టే వంద అడుగుల రోడ్డు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. 5.9 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మార్గంలో పది మంది రైతులకు చెందిన వ్యవసాయ భూమి ఉండగా మిగిలినది ప్రైవేట్ వ్యాపారులకు చెందిన వెంచర్ భూమి కోల్పోనున్నట్లు గుర్తించారు. సర్పంచ్ నరేందర్‌రెడ్డి రోడ్డు మార్గంలో కోల్పోయే తన వ్యవసాయ భూమిని ఇవ్వనున్నట్లు కమిషనర్‌కు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయన్ను అభినందించారు. వంద అడుగుల రోడ్డు మార్గం కమర్షియల్ కేంద్రంగా మారబోతుందని.. ఈ ప్రాంతంలో వ్యాపారాభివృద్ధికి ఆసక్తి చూపే వారికి పన్నుల చెల్లింపు, వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు మినాహాయింపు ఇస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. రైతులు స్వచ్ఛందంగా రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వాలని కోరారు. అధికారుల వెంట యాచారం తహసీల్దార్ అయ్యప్ప తదితరులు ఉన్నారు.


