శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
షాద్‌నగర్‌రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని డీసీపీ శిరీష హెచ్చరించారు. బుధవారం ఆమె మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పట్టణంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫరూఖ్‌నగర్ ఉన్నత పాఠశాల, గౌతమి పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన వసతులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనకు, ప్రలోభాలకు గురి కాకుండా నిస్వార్థంగా ఓటు వేయాలని అన్నారు. పోలింగ్ సక్రమంగా నిర్వహించేందుకు ప్రజలు తమవంతు సహాయ సహకారాలను అందించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలవద్ద అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
డీసీపీ కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన
ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్‌కు డీసీపీగా శిరీషను నియమించారు. పట్టణంలో డీసీపీ కార్యాలయ భవనం లేక ప్రస్తుతం ఏసీపీ కార్యాలయంలోనే కొనసాగుతోంది. డీసీపీ కార్యాలయం కోసం పట్టణ సమీపంలోని మిలీనియం టౌన్‌షిప్ కాలనీలో తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. డీసీపీ కార్యాలయం శాశ్వత భవన నిర్మాణానికి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ ప్రభుత్వ అతిథిగృహం ఆవరణలో డీసీపీ శిరీష స్థల పరిశీలన చేశారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు ఆమె వెల్లడించారు. స్థల పరిశీలనలో తహసీల్దార్ నాగయ్య, ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్‌కుమార్ ఉన్నారు.
డీసీపీ శిరీష


