నిత్య పెళ్లికొడుకు సహా నలుగురిపై కేసు

Including TDP Leader Case against four People for three weddings - Sakshi

మూడో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు 

రెండో భార్య ఫిర్యాదుతో ఇప్పటికే కర్ణాటకలో కేసు

పెద్దతిప్పసముద్రం: ముగ్గురు మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకున్న నిత్యపెళ్లికొడుకు సహా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం ఎస్‌ఐ మధురామచంద్రుడు తెలిపారు. పెద్దతిప్పసముద్రం మండలంలోని నవాబుకోటకు చెందిన టీడీపీ నాయకుడు దండుపల్లె మంజునాథ్‌ (32) ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేస్తూ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.

అతడి మోసాల గురించి తెలుసుకున్న వారిలో ఇద్దరు భార్యల ఆవేదనపై ఆదివారం ‘సాక్షి’లో ‘ఆ టీడీపీ నేత...నిత్య పెళ్లికొడుకు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కర్ణాటక రాష్ట్రం దావణగెరెకు చెందిన మూడో భార్య ఎస్‌.ప్రియాంక ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు మంజునాథ్‌తో పాటు మూడు పెళ్లిళ్లకు సహకరించిన అత్త, మామ, ఆడపడుచు అయిన వెంకట్రమణ, వెంకట్రమణమ్మ, మమతపై కేసు నమోదు చేశారు.

ఐపీసీ 495, 498ఏ, 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో కర్ణాటక వాసులు ఆరుగురి వచ్చి నవాబుకోటలో మంజునాథ్‌ ఇంటి ఎదుట బైఠాయించి వాదులాటకు దిగారని తనకు ఫోన్‌ రావడంతో సిబ్బందితో వెళ్లి విచారించినట్లు తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై మూడో భార్య ప్రియాంక ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.

ఈ కేసులో మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లు చెబుతున్నారని, ఈ విషయాన్ని కూడా విచారిస్తామని తెలిపారు. తనకు ఇంతకుముందే వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టి, అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి, తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపిస్తూ రెండో భార్య ఆశ ఈ నెల 11న కర్ణాటక  చిక్‌బళ్లాపురంలోని మహిళా పీఎస్‌లో ఫిర్యాదు చేయగా అక్కడ కేసు నమోదైందని చెప్పారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top