Robbery Hyderabad Gold: Hyderabad Police Arrested Three Accused In Gold Robbery Case - Sakshi
Sakshi News home page

ఘరానా దొంగలు: !: నా భార్య చోరీ చేయలేదని సీపీ ముందే గొడవ

Dec 19 2021 9:07 AM | Updated on Dec 19 2021 10:52 AM

Hyderabad Police Arrested Three Accused In Gold Robbery Case - Sakshi

సాక్షి హైదరాబాద్‌: చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలో ఈ ఏడాది అక్టోబర్‌ 21న చోటు చేసుకున్న 70 తులాల బంగారం దోపిడీ కేసులో ముగ్గురు నిందితులను హైదరాబాద్‌ నగర పోలీసులు పట్టుకున్నారు. మరో నిందితుడు ముంబైకి చెందిన మహ్మద్‌ తబ్రేజ్‌ దావుద్‌ షేక్‌ (33) పరారీలో ఉన్నాడు. వీరి నుంచి 41 తులాల బంగారం ఆభరణాలు, బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ వివరాలను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ పీ విశ్వప్రసాద్, అడిషినల్‌ డీసీపీ రమణరెడ్డిలతో కలిసి హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ శనివారం మీడియాకు వెల్లడించారు.  

జీహెచ్‌ఎంసీలో ల్యాండ్‌స్కేప్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న బాలకృష్ణ దోమల్‌గూడ గగన్‌మహల్‌లోని స్వామి నిలయంలో నివాసముంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ 21న కుటుంబంతో కలిసి శ్రీశైలం వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లోని 70 తులాల బంగారు ఆభరణాలు, బిస్కెట్లు చోరీ అయ్యాయి. ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయని గమనించిన వాచ్‌మెన్‌ మణికొండలో నివాసముంటున్న బాలకృష్ణ కూతురుకు ఫోన్‌ చేశాడు.దీంతో ఆమె చోరీ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

కర్నూల్‌ జిల్లాకు చెందిన సుధాకర్‌ (27), భార్య నాగమణి (22)తో కలిసి మెహదీపట్నం శ్రీరామ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతనిపై 59 కేసులు న్నాయి. పలు చోరీ కేసులలో ఇప్పటివరకు సుధాకర్‌ 17 సార్లు జైలుకు వెళ్లివచ్చాడు. ఇతనికి మరో ఘరానా దొంగ బార్కాస్‌ నబీల్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ అయూబ్‌ అలియాస్‌ బడా అయూబ్‌ (57) పరిచయమయ్యాడు. ఇతనిపై తెలుగు రాష్ట్రాల్లో 120 కేసులున్నాయి. కేవలం పశువులను దొంగతనం చేయడం అయూబ్‌ స్పెషాలిటీ. సుధాకర్, అయూబ్, నాగవేణి ముగ్గురు కలిసి చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం బాలకృష్ణ ఇంటిని టార్గెట్‌ చేశారు.  ఓ చోరీ కేసులో జైలులో ఉన్న సుధాకర్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 13న విడుదలయ్యాడు. జైలు నుంచి బయటికొచ్చిన 8 రోజులకే 21వ తేదీన బాలకృష్ణ ఇంటిలో చోరీచేశాడు.  

41 తులాల రికవరీ.. 
సుధాకర్, అయూబ్, నాగమణి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి 41 తులాల ఆభరణాలను రికవరీ చేశారు. మిగిలిన 29 తులాల రికవరీ జరగాల్సి ఉందని తబ్రేజ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వాళ్లను పట్టుకొని విచారిస్తే పూర్తి స్థాయిలో రికవరీ అవుతుందని పోలీసులు తెలిపారు. ముంబైలోని దేవ్రిపాడకు చెందిన మహ్మద్‌ తబ్రేజ్‌ దావుద్‌ షేక్‌ (38)కు విక్రయించారు. సెల్‌ ఫోన్‌ వాడకుండా, చోరీచేసిన బైక్‌ వాడి దొంగతనం చేశారు. సీసీ కెమెరాలకు దొరకకుండా పక్క అపార్ట్‌మెంట్‌ గోడ దూకి వెళ్లారు. ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా నేరస్తులు పారిపోయేందుకు వినియోగించిన మార్గాలను పోలీసులు గుర్తించారు. అలాగే జైల్‌ రిలీజ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (జేఆర్‌ఎంఎస్‌) విశ్లేషణ ద్వారా ప్రధాన నిందితుడు సుధాకర్‌ అని గుర్తించి.. కేసును చేధించినట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ పీ విశ్వ ప్రసాద్‌ తెలిపారు. 

నా భార్య చోరీ చేయలేదని సీపీ ముందే గొడవ.. 
ఇదిలా ఉండగా.. చోరీ కేసు వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ మీడియాకు తెలుపుతున్న సమయంలో వెనక వైపు నిందితులు నిల్చొని ఉన్నారు. ఆ సమయంలో ప్రధాన నిందితుడు సుధాకర్‌.. ‘తన భార్య చోరీ చేయలేదని, ఆమెను అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని’ గట్టి గట్టిగా అరుస్తూ వాగ్వాదం చేశాడు. దీంతో వెంటనే పక్కన ఉన్న పోలీసులు అప్రమత్తమై.. ఇద్దరు నిందితులను పక్కను ఉన్న గదిలోకి తీసుకెళ్లారు. ఈ విషయం గురించి పోలీసులను ప్రశ్నించగా.. ఈ చోరీ కేసులో సుధాకర్‌ దొంగిలించిన బంగారం భార్య నాగమణి తీసుకొని దాన్ని ముంబైలోని తబ్రేజ్‌కు విక్రయిస్తుంటుంది. దీంతో ఈ కేసులో ఆమెపై కూడా రిసీవర్‌గా కేసు నమోదు చేశామని పోలీసులు సమాధానమిచ్చారు.  

(చదవండి: విలేకరుల సమావేశం జరపవద్దు!... అంటూ సాలీడు ఎలా అడ్డుపడుతుందో చూడండి!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement