సాక్షి, వరంగల్: వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలోని జన్మభూమి జంక్షన్ వద్ద ఆకతాయిల వీరంగం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. నడిరోడ్డుపై బీర్ సీసాలతో హంగామా చేస్తూ కొంతమంది వ్యక్తులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. గంజాయి మత్తులో రెండు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఆ సమయంలో వారిని అదుపు చేయడానికి వెళ్లిన వారిపై కూడా దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రాంతంలో తరచూ గొడవలు జరుగుతున్నప్పటికీ పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో నివసించే వారు ప్రాణాలు గుపిట్లో పెట్టుకొని తమ గృహాలకు చేరుతున్న పరిస్థితి నెలకొంది.
రోజురోజుకి ఆకతాయిల అల్లర్లు పెరుగుతున్నాయి. వారిని అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు విఫలమవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో పోలీస్ పెట్రోలింగ్ సరిగ్గా లేకపోవడం మాకు భయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికైనా అధికారులు పెట్రోలింగ్ పెంచి గొడవలను అదుపులోకి తీసుకురావాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


