చికిత్స పొందుతున్న బంక విక్టోరియా
వేమూరు(చుండూరు): దళిత మహిళపై బాపట్ల జిల్లా చుండూరు సీఐ దౌర్జన్యం చేశాడు. ఆమెను దుర్భాషలాడడంతోపాటు తీవ్రంగా కొట్టాడు. బాధితురాలు తెనాలి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలు శనివారం ఆస్పత్రిలోని అవుట్‌పోస్టులో పోలీసులకు ఇచి్చన ఫిర్యాదు ప్రకారం.. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన బంక శారద తన భర్త చంద్రకాంత్, అత్త విక్టోరియాపై గత నెల 18న బంగారం చోరీ కేసు పెట్టింది. చుండూరు సీఐ ఆనందరావు 19న శారద, చంద్రకాంత్, విక్టోరియాలను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారు.
చంద్రకాంత్‌పై సీఐ చేయిచేసుకున్నారు. భార్యాభర్తలు సక్రమంగా కాపురం చేసుకోవాలని హెచ్చరించి పంపించారు. శారద ఇంటికి రాకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. బ్రాహ్మణకోడూరు నుంచి తన బంధువులను 10 మందిని తీసుకొని శనివారం చుండూరు పోలీసుస్టేషన్‌కు వచ్చింది. దీంతో సీఐ ఆనందరావు బంక విక్టోరియా, చంద్రకాంత్‌లను స్టేషన్‌కు పిలిపించారు. వారిని ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారు. విక్టోరియాను పొత్తి కడుపులో పొడిచి, చేతులపై కొట్టారు. తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో విక్టోరియాను తెనాలిలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకు వెళ్లారు. ప్రభుత్వ వైద్య శాలల్లో చికిత్స పొందుతున్న ఆమె అవుట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
సీఐ ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు
నా భార్య తప్పుడు కేసు పెట్టింది. సీఐ ఆనందరావు విచారణ చేయకుండా శనివారం పోలీసు స్టేషన్‌లో నా తల్లిని దుర్భాషలాడి ఇష్టారాజ్యంగా కొట్టారు. నన్ను కూడా కొట్టారు. మాకు న్యాయం చేయాలి. – బంక చంద్రకాంత్, ఆలపాడు గ్రామం


