కూతురు ఇంటి నుంచి సంతోషంగా వెళ్తుంటే.. | Hyderabad: Old Couple Died Over Hit By Train | Sakshi
Sakshi News home page

కూతురు ఇంటి నుంచి సంతోషంగా వెళ్తుంటే..

Mar 28 2023 4:56 PM | Updated on Mar 28 2023 5:01 PM

Hyderabad: Old Couple Died Over Hit By Train - Sakshi

సాక్షి, మియాపూర్‌(హైదరాబాద్‌): కూతురు వద్దకు వెళ్లి తిరిగి సొంత గ్రామానికి వెళ్తున్న వృద్ధ దంపతులు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందిన సంఘటన లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సోమవారం చోటుచేసుకుంది. రైల్వే సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి గ్రామానికి చెందిన వెంకట్‌రావు(65), అనంతలక్ష్మీ(60) దంపతులు పదిరోజుల కిందట చిలుకూరులో ఉంటున్న వారి కుమార్తె కుమారి దగ్గరకు వచ్చారు.

తిరిగి సొంతూరుకు వెళ్లేందుకు సోమవారం ఉదయం లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చి...సాయంత్రం 5:20 గంటల సమయంలో ఫస్ట్‌ ప్లాట్‌పారం నుంచి దిగి రెండవ ప్లాట్‌పారంకు వెళ్లేందుకు పట్టాలపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా శంకర్‌పల్లి వైపు నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌ వీరిని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు.

సాయంత్రం 7:30 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో నర్సాపూర్‌ రైలు ఎక్కేందుకు వచ్చినట్లు బంధువులు తెలిపారు. వృద్ధ దంపతులు ఇద్దరు మృతి చెందడంతో బంధువులు విలపించారు. తోటి ప్రయాణికులు కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement