ఫైబర్‌నెట్‌ కేసులో కీలక పరిణామం | Sakshi
Sakshi News home page

ఫైబర్‌నెట్‌ కేసు: బాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు కోర్టు అనుమతి

Published Tue, Nov 21 2023 4:45 PM

FiberNet scam case: ACB Court Orders CID To Attach Accused Properties - Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఫైబర్‌నెట్‌ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల ఆస్తుల్ని అటాచ్‌ చేయాలని నేర దర్యాప్తు విభాగం(సీఐడీ)ని మంగళవారం ఆదేశించింది విజయవాడ అవినీతి నిరోధకశాఖ న్యాయస్థానం(ఏసీబీ కోర్టు). 

ఫైబర్‌నెట్‌ స్కామ్‌ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ, ఏసీబీ కోర్టును నవంబర్‌ 6వ తేదీన  ఆశ్రయించింది. టెరాసాఫ్ట్‌ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తుల్ని అటాచ్‌ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది.  అంతకు ముందు సీఐడీ ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించింది. నిందితులకు సంబంధించి.. ఏపీ, తెలంగాణలో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతివ్వాలని పిటిషన్‌లో సీఐడీ కోరింది. 

ఈ జాబితాలో టెరాసాఫ్ట్‌ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిని అటాచ్‌ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది.  
ఫైబర్‌నెట్‌ కేసులో అటాచ్‌కు నిర్ణయించిన ఆస్తుల వివరాలు ఇవి
►తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు

►నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇళ్లు.

►మొత్తంగా అటాచ్‌ చేసే ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి. 

చంద్రబాబు  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యామని సీఐడీ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ,  ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌ పేర్లు ఉండగా.. చంద్రబాబు పేరును ఏ-25 గా సీఐడీ చేర్చింది.

Advertisement
 
Advertisement