భరత్‌పూర్: రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మూతపడిన స్టోన్ క్రషర్ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించే క్రమంలో చెలరేగిన వివాదం చివరకు బీజేపీ మాజీ ఎమ్మెల్యే అత్తర్ సింగ్ భడానా హత్యకు దారి తీసింది. భౌండా గ్రామంలోని క్రషర్ వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై 80 మంది గ్రామస్తులు ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు. ఈ ఆకస్మిక దాడితో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారి, యుద్ధభూమిని తలపించింది.
ఈ వివాదానికి నాలుగేళ్ల పాత కక్షలే ప్రధాన కారణమని తెలుస్తోంది. క్రషర్ కోసం పశువుల మేత భూములను ఆక్రమించారని, అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు గత కొంతకాలంగా శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. అయితే ఏడాదిగా మూతపడిన ప్లాంట్‌ను తిరిగి తెరిచేందుకు భడానా తన అనుచరులతో అక్కడికి చేరుకుని, నిరసనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్రస్థాయిలో కొట్లాటకు దారితీసింది.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అత్తర్ సింగ్ భడానాతో పాటు ఆయన సహచరుడు గగన్ శర్మను రక్తపు మడుగులో స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో భడానాను వెంటనే జైపూర్‌లోని ఎస్ఎంఎస్ (ఎస్‌ఎంఎస్) ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు, అధికారులకు ముందుగానే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని మాజీ ఎమ్మెల్యే భార్య కమలేష్ కన్నీరుమున్నీరవుతూ ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే హత్యతో భౌండా గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రతీకార దాడులు జరగకుండా అధికారులు గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఘటనా స్థలంలో తుపాకీ కాల్పులు జరిగాయా లేదా అనే కోణంలో ఫోరెన్సిక్ ఆధారాలు సేకరిస్తూ, దాడికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి: 151 ఏళ్ల రామ్‌లీల: షాకిస్తున్న పాత్రధారుల నియమాలు


