‘స్కిల్‌’ స్కామ్‌ మీ బాబు నిర్వాకమే | Sakshi
Sakshi News home page

‘స్కిల్‌’ స్కామ్‌ మీ బాబు నిర్వాకమే

Published Sun, Sep 24 2023 4:39 AM

ED found corruption in skill scam - Sakshi

సాక్షి, అమరావతి: ఈనాడు రామోజీరావు ఎన్ని కట్టు కథలు చెబుతున్నా ‘స్కిల్‌’ కుంభకోణంలో చంద్ర­బాబు అవినీతి బండారాన్ని మాత్రం దాచలేకపోతు­న్నారు. అయ్యో.. అయ్యో మా చంద్రబాబు ఎలాంటి అవినీతి చేయలేదు.. అదిగో జీవో.. ఇదిగో సీమెన్స్‌ ఒప్పందం.. అంటూ రామోజీ రోజూ పేజీ­లకు పేజీలు అభూతకల్పనలు ప్రచురిస్తున్నా ఈ కుంభకోణంలో అవినీతి దాగడం లేదు. సీఐడీనే కాదు.. కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), జీఎస్టీ విభాగాలు కూడా టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌­ఎస్‌­డీసీ)లో అవినీతి బాగోతాన్ని ఆధారాలతోసహా బట్టబయలు చేశాయి.

సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండా చంద్రబాబు, ఆయన ముఠా ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ పేరిట నిధులు కొల్లగొట్టారని ఆధారాల­తోసహా వెలికి తీశాయి. మరోవైపు అసలు ఈ ప్రాజెక్ట్‌ గురించే తమకు తెలియదని సీమెన్స్‌ కంపెనీ పదే పదే స్పష్టం చేస్తున్నా, ఏకంగా న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చినా.. రామోజీరావు మాత్రం ససే­మిరా అంటున్నారు.

అదేమీ కుదరదు.. ‘మా ఈనాడే న్యాయస్థానం.. నేనే న్యాయమూర్తి’ అన్నట్లు తిమ్మిని బమ్మిని చేయాలని యత్నిస్తుండటం దిగజా­రుడు పాత్రికేయానికి నిదర్శనం. చంద్రబాబు కోసం జారేందుకు ఇక మేట్లే లేవు.. వదిలేసేందుకు ప్రమా­ణాలే లేవన్నట్టుగా ఈనాడు మరోసారి అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజల్ని మోసగించేందుకు య­త్నిం­చింది. అందుకే అసలు వాస్తవాలు మరోసారి..

ఒప్పందం గురించి మాకు తెలీదు: సీమెన్స్‌ 
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ గురించి అసలు తమకు తెలియదని జర్మనీలోని సీమెన్స్‌ ప్రధాన కార్యాలయం విస్పష్టంగా ప్రకటించింది. ఈ మేరకు ఏపీఎస్‌ఎస్‌డీసీకి ఈ మెయిల్‌ ద్వారా తెలియజేయడంతోపాటు న్యాయ­స్థానంలో సెక్షన్‌ 164 కింద వాంగ్మూలం కూడా ఇచ్చింది. న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడం కంటే స్పష్టమైన, సాధికారికమైన సాక్ష్యం మరొకటి ఉండదు. అయినా సరే చంద్రబాబు కుదుర్చుకున్న నకిలీ ప్రాజెక్ట్‌ సరైందేనని నమ్మించేందుకు ఈనాడు పత్రిక పడరాని పాట్లు పడుతోంది. ఏపీ సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా స్కిల్‌ స్కామ్‌పై విచారణ చేస్తోంది.

షెల్‌ కంపెనీల ద్వారా నిధులు మళ్లించారని నిర్ధారించి, ఈ కుంభకోణంలో చంద్రబాబు ముఠా సభ్యులైన సీమెన్స్‌ ఇండియా ఎండీగా వ్యవహరించిన సుమన్‌ బోస్‌ (ఆయన అవినీతి వ్యవహారంపై విచారించి సీమెన్స్‌ కంపెనీ ఆయన్ను తొలగించింది), డిజైన్‌టెక్‌ కంపెనీ ఎండీ వికాస్‌ వినాయక్‌ కన్వేల్కర్‌లతోపాటు నలుగురిని అరెస్ట్‌ చేసింది. వారికి న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీమెన్స్‌ ఇండియా కంపెనీ ప్రస్తుత ఎండీ మాథ్యూ థామస్‌ ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు.

ఆ వాంగ్మూలం ఆధారంగానే డిజైన్‌టెక్‌ కంపెనీకి చెందిన రూ.32.31 కోట్ల బ్యాంకు ఖాతాలను ఈడీ అటాచ్‌ చేసింది. అందుకోసం జారీ చేసిన ‘ప్రొవిజనల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ అటాచ్‌మెంట్‌’లో మాథ్యూ థామస్‌ వాంగ్మూలాన్ని ఈడీ సవివరంగా పేర్కొంది. ప్రజాధ­నాన్ని దుర్వినియోగం చేశారని.. అప్పటి సీమెన్స్‌ ఇండియా ఎండీగా ఉన్న సుమన్‌ బోస్‌ కుమ్మక్కు అయ్యారని కూడా ఆయన స్పష్టం చేశారు. కానీ ఆయన చెప్పిన విషయాలను వెల్లడించకుండా.. చంద్రబాబుకు అనుకూలంగా వక్రీకరిస్తూ ఈనాడు ప్రజ­లను మోసగించేందుకు యత్నించింది.

ఏపీఎస్‌­ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ అంతా సవ్యంగానే సాగిందని అవాస్తవాన్ని ప్రచురించింది. టీడీపీ ప్రభుత్వం తమ కంపెనీ పేరిట కుదర్చుకున్న ఒప్పందం నకిలీదని, తమకు అసలు ఆ ఒప్పందం గురించి తెలియదని మాథ్యూ థామస్‌ స్పష్టం చేశారు. కాదు.. కాదు.. అది అసలైన ఒప్పందమే అని నమ్మించేందుకు ఈనాడు తనకు అలవాటైన రీతిలో దిగజారుడు పాత్రికేయాన్ని మరోసారి ప్రదర్శించింది. 

అది నకిలీ ఒప్పందం
ఓ హోల్‌సేలర్‌కు, డిస్ట్రిబ్యూటర్‌కు ఉన్న వ్యాపార లావాదేవీని ఏకంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ ఒప్పందంగా భ్రమింపజేసేందుకు ఈనాడు పడరాని పాట్లు పడింది. ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ఈ కుంభకోణం సూత్రధారి చంద్రబాబు పన్నిన పన్నాగంలో పాత్రధారైన సుమన్‌ బోస్‌ అందుకోసం తీసుకువచ్చిన డిస్ట్రిబ్యూటరే డిజైన్‌టెక్‌ కంపెనీ. అందుకే ఈ కేసులో సుమన్‌బోస్‌తోపాటు డిజైన్‌టెక్‌ ఎండీ వికాస్‌ వినాయక్‌ కన్వేల్కర్‌ను సీఐడీతోపాటు ఈడీ కూడా అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో వారిద్దరినీ అరెస్ట్‌ చేశారన్న వాస్తవాన్ని ఈనాడు తన వార్తా కథనంలో ఎక్కడా ప్రస్తావించ లేదు. అటువంటి సుమన్‌బోస్, వికాస్‌ కన్వేల్కర్‌ సృష్టించిన నకిలీ ఒప్పందాన్ని అసలైన ఒప్పందంగా నమ్మించేందుకు ఈనాడు కుయుక్తి పన్నడం విస్మయ పరుస్తోంది. 

‘గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌’ విధానమే లేదు
అసలు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ (ఆర్థిక సహాయం) అన్న విధానమే సీమెన్స్‌ కంపెనీ ఏనాడూ అనుసరించలేదని కూడా మాథ్యూ థామస్‌ స్పష్టం చేశారు. ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి సంస్థలకు కూడా గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌ ఏనాడూ ఇవ్వలేదన్నారు. కానీ తమ కంపెనీకి తెలియకుండా సుమన్‌ బోస్‌ అప్పటి చంద్రబాబు ప్రభుత్వంతో కుమ్మక్కై  గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ వస్తుందని నకిలీ ఒప్పందం సృష్టించారని చెప్పారు. అంటే టెండర్ల ప్రక్రియ లేకుండా ఏకపక్షంగా నిధులు కొల్లగొట్టేందుకే చంద్రబాబు ముఠా ఈ కుతంత్రానికి పాల్పడింది.

ఇక ఈ ప్రాజెక్ట్‌ కింద బిల్లుల చెల్లింపునకు సమర్పించిన ఇన్వాయిస్‌లు కూడా తమ కంపెనీవి కావని, అవి నకిలీవని మాథ్యూ థామస్‌ స్పష్టం చేశారు. సీమెన్స్‌ కంపెనీ సహజంగా అనురించే పద్ధతుల్లో ఇన్వాయిస్‌లు లేవని, సాఫ్ట్‌వేర్‌ వారీగా, హార్డ్‌వేర్‌ వారీగా రేటు ఎంత.. ఎంత డిస్కౌంట్‌ ఇచ్చారు.. అనే విషయాలే లేవన్నారు. అంటే సీమెన్స్‌ కంపెనీ పేరిట సృష్టించినవి నకిలీ ఇన్వాయిస్‌లేనన్నది స్పష్టమైందన్నారు. ఆయన చెప్పిన అంశాలను ఈనాడు ప్రచురించకుండా చంద్రబాబు అవినీతికి ముసుగు వేసేలా వక్రీకరించి తన క్షుద్ర పాత్రికేయాన్ని ప్రదర్శించింది.

ఆ షెల్‌ కంపెనీలతో సీమెన్స్‌కు సంబంధం లేదు
నిధులు కొల్లగొట్టేందుకు ‘నాలెడ్జ్‌ పోడియం సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే సంస్థను కూడా సుమన్‌ బోస్‌ తెరపైకి తెచ్చారని మాథ్యూ థామస్‌ చెప్పారు. సీమెన్స్‌ కంపెనీ ఏనాడు ఆ కంపెనీతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించలేదని తెలిపారు. కానీ ఆ కంపెనీని వెండార్‌గా చూపించారని.. ఆ కంపెనీ  ద్వారా పరికరాలు సరఫరా చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసి, సుమన్‌ బోస్‌ అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. ఆ విషయం సీమెన్స్‌ కంపెనీ అంతర్గత విచారణలో కూడా వెల్లడైందన్నారు.

నాలెడ్జ్‌ పోడియం సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీతోపాటు టాలెంట్‌ ఎడ్జ్, అలైడ్‌ కంప్యూటర్స్‌ ఇంటర్నేషనల్‌ ఏసియా లిమిటెడ్, స్కిలర్‌ ఎంటర్‌ ప్రైజస్, డిజైన్‌ టెక్‌ కంపెనీలకు చెందిన యాజమా­నులతో సుమన్‌బోస్‌ కుమ్మక్కయ్యారని తమ విచారణలో నిగ్గు తేలిందని మాథ్యూ థామస్‌ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. సుమన్‌బోస్, వికాస్‌ వినాయక్‌ కన్వేల్కర్, ముకుల్‌ చంద్ర అగర్వాల్‌ ఒక వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకుని ఈ అక్రమాలకు పాల్పడ్డారని తాము గుర్తించామన్నారు.

నిధులు అక్రమంగా మళ్లింపులో సాధనంగా వ్యవహరించిన ఫిష్‌ హాస్పిటాలిటీ, యాక్సన్‌ స్మార్ట్‌ కేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, యాక్స్‌ స్మార్ట్‌ హెల్త్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, గోఫార్‌ అడ్వైర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్, అప్‌టస్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్, బెన్‌ రీసెర్చ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలతో సీమెన్స్‌ కంపెనీ ఏనాడూ ఎలాంటి లావాదేవీలను నిర్వహించలేదని మాథ్యూ థామస్‌ స్పష్టం చేశారు. సుమన్‌ బోస్‌ తన స్వార్థం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని విచారణలో ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యిందన్నారు. కానీ ఈనాడు పత్రిక ఆ విషయాలను ఎక్కడా ప్రచురించకపోవడం రామోజీరావు కుట్రపూరిత వైఖరికి నిదర్శనం. 


సీఐటీడీ మదింపే లేదు 
ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలో తమ అధినేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి రిమాండ్‌ ఖైదీగా ఉండటంతో టీడీపీకి దిక్కుతోచడం లేదు. అందుకే కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు ఆ పార్టీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. సీఐటీడీ మదింపు నివేదిక ఇచ్చిందంటూ అవాస్తవాలు ప్రచారంలోకి తెస్తున్నారు. టీడీపీ నేతలు, పచ్చ మీడియా లేవనెత్తిన రెండు ప్రశ్నలకు ప్రభుత్వం దీటుగా సమాధానం ఇచ్చింది. 

ప్రశ్న 1: ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థ సీఐడీటీ కన్నా, ప్రైవేట్‌ సంస్థే ముద్దా.. సీఐడీటీ నివేదికను పరిగణనలోకి తీసుకోరా.. ఒక్కో క్లస్టర్‌కు రూ.559 కోట్లుగా సీఐటీడీ ఇచ్చిన నివేదికను ఎందుకు పట్టించుకోలేదు?
వాస్తవం :  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కుంభకోణం కోసం చంద్రబాబు, ఆయన ముఠా సీఐటీడీ సంస్థను వాడుకున్నారు. వాస్తవంగా ఆ ప్రాజెక్ట్‌పై సీఐడీటీ ఎలాంటి మదింపు నివేదిక ఇవ్వనే లేదు. ఆ ప్రాజెక్ట్‌ను కనీసం పరిశీలించనూ లేదు. ఆ ప్రాజెక్ట్‌ పేరిట నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు మంజూరు చేసిన తర్వాత ఆ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ముఠా పన్నిన పన్నాగంతో సీఐడీటీ పేరిట మదింపు నివేదికను తెరపైకి తెచ్చారు. ఈ అంశంలో అసలు వాస్తవాలను సీఐటీడీ సంస్థే వెల్లడించింది. ‘టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ అధికారులు, డిజైన్‌ టెక్‌ ప్రతినిధులు 2015 డిసెంబర్‌ 18న ఓ ప్రాజెక్ట్‌ నివేదిక కాపీని తీసుకువచ్చి సీఐటీడీ సంస్థను పరిశీలించమని కోరారు.

ఆ కాగితాలను చూసి తాము అంచనా నివేదిక ఇచ్చాం. తాము ఇచ్చింది మదింపు నివేదిక కాదు.. కేవలం పరిశీలన పత్రమే. అంతేగానీ అసలు ఆ ప్రాజెక్ట్‌ వాస్తవంగా ఉందా లేదా అన్నది మేము క్షేత్ర స్థాయిలో పరిశీలించలేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి సాఫ్ట్‌వేర్, పరికరాలు, మౌలిక వసతుల విలువను అంచనా వేసి నివేదిక ఇస్తే అది మదింపు నివేదిక అవుతుంది. కానీ మేము ఇటువంటి మదింపు నివేదిక ఇవ్వలేదు. మా పేరుతో ప్రచారంలో ఉన్న మదింపు నివేదికతో మాకు సంబంధం లేదు’ అని తేల్చి చెప్పింది. కేవలం ప్రతిపాదనలు చూసి నివేదిక ఇవ్వడం అంటే ‘డీపీఆర్‌’ ఇవ్వడం లాంటిదే.

ఇక వారి వద్దకు పత్రాలు తీసుకువచ్చే నాటికే అంటే 2015 డిసెంబర్‌ 18కే ఆ ప్రాజెక్ట్‌ వ్యయంలో ప్రభుత్వ వాటా 10 శాతం అంటే రూ.337 కోట్లను డిజైన్‌టెక్‌ కంపెనీకి ప్రభుత్వం చెల్లించేసిందని కూడా సీఐడీటీ తెలిపింది. కాబట్టి తమ నివేదిక ఆధారంగానే నిధులు చెల్లించారన్నది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. మరి అది నిబంధనలకు విరుద్ధమే కదా రామోజీ?

ప్రశ్న 2:  2.13 లక్షల మంది సీమెన్స్‌ ప్రాజెక్టు ద్వారా శిక్షణ పొందారు.. 80 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి..
వాస్తవం : అసలు సీమెన్స్‌ కంపెని తమకు ఆ ఒప్పందమే తెలియదు.. ఆ ప్రాజెక్ట్‌ గురించే తెలీదు అని స్పష్టం చేసింది. ప్రాజెక్ట్‌ వ్యయంలో 90 శాతం నిధులను సమకూర్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అనే విధానమే తమ వద్ద లేదని కూడా కుండబద్దలు కొట్టింది. తమ అంతర్గత విచారణలో కూడా ఆ అంశం నిర్ధారణ అయ్యిందని చెప్పింది. ఈ మేరకు న్యాయస్థానంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 164 కింద వాంగ్మూలం ఇచ్చింది. ఇలాంటి సీమెన్స్‌ కంపెనీ 90 శాతం నిధులు సమకూర్చేందుకు ఒప్పదం చేసుకున్నామని టీడీపీ చెబుతుండటం పూర్తిగా అవాస్తవం.

ఆ ప్రాజెక్ట్‌ అన్నదే లేనప్పుడు.. 2 లక్షల మందికి ఎలా శిక్షణ ఇస్తారు? ఇలా చెప్పడం ప్రజలను మోసగించడమే. ఆ ప్రాజెక్ట్‌ కింద శిక్షణ పొందని విద్యార్థులను శిక్షణ పొందినట్టుగా.. బీటెక్‌ అర్హతతో విద్యార్థులు తాము చదువుకున్న ఇంజినీరింగ్‌ కాలేజీల్లో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ కింద ఉద్యోగాలు పొందిన వారిని ఈ ప్రాజెక్ట్‌ కింద ఉద్యోగాలు వచ్చినట్టుగా నమ్మించేందుకు టీడీపీ కుట్ర పన్నుతోంది.   

Advertisement
Advertisement