‘దేశం’లో కలకలం! | TDP leaders silence on Hyderabad drug case | Sakshi
Sakshi News home page

‘దేశం’లో కలకలం!

Mar 16 2026 4:38 AM | Updated on Mar 16 2026 4:38 AM

TDP leaders silence on Hyderabad drug case

హైదరాబాద్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో టీడీపీ నేతల గప్‌చుప్‌

వరుస ఘటనలతో పార్టీ పరువు బజారున పడిందని చర్చ  

టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు రాసలీలలు వ్యవహారంతో తలనొప్పి 

కొద్దిరోజుల క్రితమే డ్రగ్స్‌ తీసుకుని దొరికిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు 

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ లైంగిక వేధింపుల వ్యవహారంతో రచ్చ రచ్చ 

పార్టీ కార్యకర్తని లైంగికంగా వేధించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం 

కూటమి నేతలపై తీవ్ర ఆరోపణలు రావడంతో చంద్రబాబు సతమతం

సాక్షి, అమరావతి: హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రకరకాల గారడీలు చేస్తుంటే పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు డ్రగ్స్‌ పార్టీలు, రాసలీలల్లో మునిగి తేలుతుండడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ హైదరాబాద్‌లో జరిగిన ఒక డ్రగ్స్‌ పార్టీలో అడ్డంగా దొరికిపోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఘటనతో ఉలిక్కిపడిన టీడీపీ శిబిరం ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతోంది. మహేశ్‌ డ్రగ్స్‌ వ్యవహారంతో టీడీపీ పరువు బజారున పడిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. 

ఇలాంటి నేతలకు సీట్లు ఇచ్చి చంద్రబాబు ఇప్పుడు నాలుక కరుచుకుని ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పుట్టా మహేశ్‌కు రాజకీయ అవగాహన లేకపోయినా, కేవలం డబ్బు ఉందనే కారణంతో కడప జిల్లా నుంచి తీసుకువచ్చి గత ఎన్నికల్లో ఏలూరు ఎంపీ సీటు ఇచ్చారు. ఎక్కడి నుంచో వలస వచ్చిన నేతకు ఇక్కడ ఎంపీగా చేయడం ఏమిటని స్థానిక టీడీపీ నేతలంతా వ్యతిరేకించినా చంద్రబాబు ఆయనకే సీటిచ్చారు.

ఎంపీగా గెలిచిన తర్వాత మహేష్‌ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా మాత్రమే వెళుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పుట్టా మహేష్‌ టీడీపీ సీనియర్‌ నాయకుడు యనమల రామకృష్ణుడికి సొంత అల్లుడు. మరో సీనియర్‌ నేత, టీటీడీ మాజీ చైర్మన్, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కొడుకు. అందుకే ఆయనకు ఎంపీ సీటు చాలా సులభంగా దక్కిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.    

బీఆర్‌ నాయుడు రాసలీలలు మరవక ముందే.. 
ఏడాదిగా కూటమి పార్టీల నేతలు ప్రజలు, పరిపాలనను గాలికి వదిలేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు రాసలీలల వీడియోలు బయటకు రావడంతో దానిపై రాజకీయ దుమారం రేగింది. తన చేష్టలను బీఆర్‌ నా­యుడు నిస్సిగ్గుగా సమర్థించుకున్నా, సోషల్‌ మీడి­యా మాత్రం ఆయన నిజ స్వరూపాన్ని కడిగి పారేసింది. కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయానికి చైర్మన్‌గా ఉన్న వ్యక్తి రాసలీలలు బయటకు రావడంతో ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్‌ బ­లంగా వచ్చింది. 

అయితే ఆయన ఒక టీవీ ఛానల్‌కు యజ­మాని కావడంతో ఆయనపై చర్య తీసుకునేందుకు, రాజీనామా చేయించేందుకు చంద్రబాబు వెను­కాడినట్లు ప్రచారం జరిగింది. కానీ నీతి నియమాలు లేని వ్యక్తిని పవిత్రమైన టీటీడీ చైర్మన్‌ పదవిలో కూర్చోబెట్టడం, ఆయనకు చంద్రబాబు మద్ద­తు పలకడంపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్‌ నాయుడి వ్యవహారం సర్దుమణగక ముందే పుట్టా మహేశ్‌ డ్రగ్స్‌ వ్యవహారం గుట్టు రట్టయింది.  

అదే బాటలో పలువురు క్యూ 
కొద్దిరోజుల క్రితం జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొడుకు సైతం హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సేవిస్తూ పట్టుబడ్డాడు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆ నియోజకవర్గానికి చెందిన కేజీబీవీ ప్రిన్సిపాల్‌ మీడియా ఎదుట చెప్పి బోరున విలపించారు. ఆమెకు న్యాయం చేయకపోగా ఆమెను బెదిరించి నోరు మూయించేందుకు ఎమ్మెల్యే, అధికార పార్టీ నేతలు ప్రయత్నించారు. 

జనసేనకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తనను లైంగికంగా వేధించినట్లు ఒక మహిళ వీడియోలు విడుదల చేయడం కలకలం రేపింది. ఆయన్ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచడం తప్ప జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి ఆయనపై చర్య తీసుకోలేదు. టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం రట్టయింది. ఆయన వేధింపుల వీడియోలు బయటకు వచి్చనా బాధితుల్ని బెదిరించి రాజీ చేశారనే విమర్శలు వచ్చాయి. 

గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ నజీర్‌ మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. కూటమిలో ప్రధానంగా టీడీపీ, జనసేన నేతలకు సంబంధించి తరచూ రాసలీలలు, లైంగిక వేధింపులు, డ్రగ్స్‌ వ్యవహారాలు బయట పడుతున్నాయి. చంద్రబాబు పైకి నీతి సూత్రాలు చెబుతూ కవర్‌ చేస్తున్నా, ఆ పార్టీల ప్రజాప్రతినిధులు మాత్రం ఇష్టానుసారం చెలరేగిపోతున్నట్లు ఈ ఘటనల ద్వారా తేటతెల్లమవుతోంది.

ఆ ఎంపీకి షోకాజ్‌తో సరి
హైదరాబాదులో డ్రగ్స్‌ తీసుకుని పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కు కేవలం షోకాజ్‌ నోటీసులు ఇచ్చి సరిపెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్‌ అయినట్లు అనుకూల మీడియాకు టీడీపీ కార్యాలయం ఆదివారం లీకులు ఇచ్చింది. ఆయనకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వా­లని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పినట్లు తెలిసింది. 

అయితే చంద్రబాబు సీరియస్‌ అయినట్లు, షోకాజ్‌ నోటీసులు ఇవ్వమన్నట్లు ఇచ్చిన లీకులన్నీ డ్రామాయేననే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మహేశ్‌కు ఎలాంటి షోకాజ్‌ నోటీసులు జారీ చేయలేదని సమాచారం. తీవ్ర స్థాయి ఆరోపణలు వచ్చినా సరే చంద్రబాబు ఆయన్ను వెనకేసుకుని వస్తున్నట్లు తెలుస్తోంది. లేకపోతే ఈపాటికి సస్పెన్షన్‌ చేసేవారని.. బాబు తీరు చూస్తుంటే అంతా ఉత్తుత్తి హడావుడేనని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement