కేంద్ర నిధుల్లో కోత | Huge cuts in allocations for centrally sponsored schemes | Sakshi
Sakshi News home page

కేంద్ర నిధుల్లో కోత

Mar 16 2026 4:33 AM | Updated on Mar 16 2026 4:33 AM

Huge cuts in allocations for centrally sponsored schemes

కేటాయింపుల మేరకు ఖర్చు చేయడంలో చంద్రబాబు విఫలం 

కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రూ.4,042 కోట్లు కోత 

అత్యధికంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిలో రూ.1,026 కోట్లు కోత 

మునిసిపల్‌ శాఖకు రూ.832 కోట్లు కోత 

సెకండరీ విద్యకు రూ.620 కోట్లు తగ్గింపు      

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్నప్పటికీ నిధులను సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడంలో సీఎం చంద్రబాబు మరోసారి విఫలమయ్యారు. ఈ ఆర్థిక ఏడాది (2025–26) కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో రాబట్టలేక చేతులెత్తేశారు. 

ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్న తరుణంలో నిధులను సకాలంలో వ్యయం చేయకపోవడంతో కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపుల్లో భారీగా కోత పడింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో రూ.4,042 కోట్ల మేర కోత విధించింది. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మునిసిపల్, పట్టణాభివృద్ధి, సెకండరీ విద్యకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు గండి పడింది.  

ఆ నిధులు.. ఇతర రాష్ట్రాలకు! 
ఈ ఆర్థిక ఏడాది కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రూ.18,662 కోట్లను కేటాయించగా చివరిలో రూ.14,620 కోట్లకు కుదించింది. అంటే రూ.4,042 కోట్ల మేర కోత పడింది. ఏ రాష్ట్రమైనా కేటాయించిన నిధులను సకాలంలో వ్యయం చేయకుంటే ఆ మేరకు కోత విధించి ఇతర రాష్ట్రాలకు అదనంగా అందజేస్తుంది. కేంద్రం కేటాయించిన నిధులను సైతం వ్యయం చేయకుండా కోత విధించే దుస్థితికి టీడీపీ కూటమి సర్కారు అసమర్థతే నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

సాధారణంగా కేటాయింపులను సకాలంలో ఖర్చు చేసి అదనపు నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతారు. దీనికి భిన్నంగా చంద్రబాబు సర్కారు పాలన కొనసాగుతోంది. ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు కేటాయింపుల్లో రూ.1,026 కోట్లు, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలకు రూ.832 కోట్లు, సెకండరీ విద్య కేటాయింపుల్లో రూ.620 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.389 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.236 కోట్లు, గృహ నిర్మాణ శాఖలకు కేటాయింపుల్లో రూ.154 కోట్ల మేర కేంద్రం కోత విధించింది. 

Advertisement
 
Advertisement
Advertisement